Iran Threatens Trump: ‘మేం ట్రంప్‌ను చంపేస్తాం..’ ఇరాన్‌లో భారీ భారీ హోర్డింగ్ కలకలం..

Iran Tehran Trump Death Threat

Iran Tehran Trump Death Threat

Iran Threatens Trump: అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న కీలక సమయంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కలకలం రేగింది. ‘మేం ట్రంప్‌ను చంపేస్తాం’ అని రాసి ఉన్న భారీ హోర్డింగ్‌ను టెహ్రాన్ వీధుల్లో ఏర్పాటు చేస్తూ ఇరాన్ బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. టెహ్రాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఎంగెలాబ్ స్క్వేర్‌లో ఈ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జైలు కటకటాల వెనుక తలదించుకుని కూర్చున్నట్లుగా చూపించారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అక్కడ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ప్రభుత్వ మద్దతుతో జరుగుతున్న ఈ ప్రదర్శనలలో అమెరికాపై పగ తీర్చుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

మరొక బిల్ బోర్డుపై ట్రంప్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశీ రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్న చిత్రాలను పొందుపరిచారు. ఈ నలుగురి ముఖాలు రక్తసిక్తమై, బట్టలు చిరిగిపోయినట్లు చూపించడమే కాకుండా, వారి వెనుక అమెరికా, ఇజ్రాయెల్ జెండాలు ధ్వంసమైనట్లు చిత్రీకరించారు. ఖమేనీ మరణానికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని అక్కడి ప్రజలు నినాదాలు చేస్తున్నారు. మంగళవారం అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మరోసారి సైనిక దాడులకు సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ సమాచారంతో ముందస్తు జాగ్రత్తగా ఇరాన్ తన అణు కేంద్రాల వద్ద భద్రతను భారీగా పెంచింది. ఈ పరిణామాలన్నీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి.

ఇక, టెహ్రాన్‌లో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రదర్శనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా నగరం అంతటా ట్రంప్‌ను హేళన చేస్తూ, యుద్ధంలో అమెరికాపై విజయం సాధిస్తామని హెచ్చరించేలా పలు పోస్టర్లు, గోడ చిత్రాలను ప్రదర్శించారు. ఉత్తర టెహ్రాన్‌లోని తజ్రీష్ స్క్వేర్‌లో నిర్వహించిన ఓ బహిరంగ ప్రదర్శనలో ట్రంప్‌ను అవమానకరమైన రీతిలో చూపే పెయింటింగ్స్‌ను ఉంచారు. అందులో ఒక చిత్రంలో ట్రంప్ ముఖం రక్తంతో నిండి నేలపై పడి ఉండగా, ఆయన తలను ఒక కాలు తొక్కుతున్నట్లు చూపించారు. మరొక చిత్రంలో ఆయన ముఖాన్ని బాంబుతో కప్పివేశారు. దీనికి తోడు ప్రదర్శన ప్రాంగణంలో ఒక జైలు గది నమూనాను ఏర్పాటు చేసి, అందులో ట్రంప్ పోలికలతో ఉన్న ఒక నటుడిని రోజంతా ఉంచుతున్నారు. ఆ గది పక్కనే ఉన్న స్క్రీన్‌పై ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడుల వల్ల జరిగిన విధ్వంసకర దృశ్యాలను ప్రదర్శిస్తున్నారు.