ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) రసతవత్తరంగా సాగుతోంది. రోజు రోజుకూ అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతూ వస్తోంది. ఈ సీజన్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. కానీ.. మంచి ప్రదర్శన ఇస్తారని భావించిన కొంత మంది ఆటగాళ్ళు మాత్రం నిరాశ పరుస్తున్నారు. వీళ్లను భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి కొన్నా.. వీరి ప్రదర్శన ఇప్పటివరకు పేలవంగా ఉంది. ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇలాంటి 5 మంది ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రిషబ్ పంత్..
ఈ సీజన్ రిషబ్ పంత్ చాలా దారుణంగా ఆడుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ను రూ.27 కోట్లకు కొనుగోలు చేశారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. కానీ.. 7 మ్యాచ్‌ల్లో కేవలం 17.17 సగటు, 100 స్ట్రైక్ రేట్‌తో 103 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై 63 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయినా.. ఆ మ్యాచ్‌లో జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత దారణమైన ప్రదర్శన సాగించాడు. పంత్ ని కెప్టెన్సీ కూడా ప్రశ్నార్థకంగా మారింది.
గ్లెన్ మాక్స్వెల్
గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్‌లో స్టార్‌గా నిలిచేవాడు. అందుకే జట్లు అతన్ని తమతోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. పంజాబ్ కింగ్స్ జట్టు మాక్స్‌వెల్‌ను రూ.4.2 కోట్లకు నిలుపుకుంది. కానీ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో మాక్స్‌వెల్ కేవలం 41 పరుగులు మాత్రమే సాధించాడు. లాంగ్ ఫోర్లు, సిక్సర్లు కొట్టడంలో ప్రసిద్ధి చెందిన మాక్స్వెల్ ఈ సీజన్‌లో కేవలం 4 ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే కొట్టాడు.
రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ టీంలో రోహిత్ శర్మకు ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలుసు. తన కెప్టెన్సీలో ఈ జట్టు 5 సార్లు టైటిల్స్ సొంతం చేసుకుంది. ఈ సారి ముంబై మేనేజ్‌మెంట్ రోహిత్‌ను రూ.16.30 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో రోహిత్ అత్యధిక స్కోరు కేవలం 26 పరుగులు మాత్రమే. రోహిత్ శర్మ ఈ ప్రదర్శన కారణంగానే ముంబై కష్టాల పాలైందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముంబై ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.
వెంకటేష్ అయ్యర్..
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వెంకటేష్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్ల భారీ మొత్తానికి కొంది. కానీ అయ్యర్ మాత్రం ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 24.5 సగటు, 155.05 స్ట్రైక్ రేట్‌తో 121 పరుగులు మాత్రమే చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 60 పరుగులు చేసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. తర్వాత చెతికల పడ్డాడు.
మార్కస్ స్టోయినిస్
మార్కస్ స్టోయినిస్ (పంజాబ్ కింగ్స్) ను పంజాబ్ కింగ్స్ రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ 6 మ్యాచులు ఆడిన స్టోయినిస్ 66 పరుగులు మాత్రమే చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన ఇన్నింగ్స్‌లో 11 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు. ఇదే అత్యధిక స్కోరు. మరోవైపు బౌలింగ్‌లో సైతం ఫలితం శూన్యం. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు.