కాస్త లేట్ అయినా.. తన కెప్టెన్సీలో విజయం సాధించడం సంతోషంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. మ్యాచ్‌లో తాము 20 పరుగులు తక్కువగా చేశామన్నాడు. చెన్నైకి ఏమాత్రం అవకాశం అవ్వకుండా.. తమ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారని ప్రశంసించాడు. నితీశ్ రాణా బ్యాటింగ్‌లో ఇచ్చిన మెరుపు ఆరంభం చాలా కీలకంగా మారిందని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్ 182 పరుగులు చేయగా.. చెన్నై 176 పరుగులకే పరిమితమైంది.
Also Read: RR vs CSK: మా ఓటమికి కారణం అదే: రుతురాజ్
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ… ‘కాస్త లేట్ అయినా.. నా కెప్టెన్సీలో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. రెండు మ్యాచ్‌లలో ఓడి.. మూడో మ్యాచ్‌లో గెలిచాం. మ్యాచ్‌లో 20 పరుగులు తక్కువగా చేశామనిపించింది. మిడిల్ ఓవర్లలో మేము బాగానే ఆడాము కానీ.. రెండు వికెట్లు త్వరగా కోల్పోయాము. మా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మా ప్రణాళికలను అమలు చేశారు. చెన్నై బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ సీజన్‌లో మేము రెండు కఠినమైన మ్యాచ్‌లను ఆడాము. మొదటి ఆటలో 280 పరుగులు లక్ష్యం ఛేదించలేకపోయాం, రెండవ ఆటలో 180 పరుగులను రక్షించలేకపోయాము. అదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో దాదాపుగా 180 టార్గెట్ ఉన్నా.. బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనతో గెలిచాం. నితీశ్ రాణా బ్యాటింగ్ మాకు కలిసొచ్చింది. మేము బ్యాటింగ్‌లో తక్కువ చేసిన 20 పరుగులను ఫీల్డింగ్ ద్వారా కాపాడుకున్నాం. ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్‌తో మేము కఠినంగా శ్రమిస్తున్నాం’ అని తెలిపాడు.