RP Singh About RCB Retentions for IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని ఐపీఎల్ పాలక వర్గం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ప్రతి ప్రాంచైజీకి అవకాశం ఇచ్చింది. ఇందులో ఓ రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. దీంతో ఏ ఫ్రాంఛైజీ ఎవరెవరిని అట్టిపెట్టుకుంటుందనే దాని గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రిటెన్షన్‌పై టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. విరాట్ కోహ్లీని మాత్రమే రిటైన్ చేసుకుని.. మిగతా ఆటగాళ్లని వేలంలోకి విడుదల చేసి మళ్లీ తిరిగి పొందాలని సూచించాడు.
టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన ఇటీవల కాలంలో బాగాలేదని, అతడు రూ.14 కోట్ల ధరకు చేరుకుంటాడని తాను అనుకోవట్లేదని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. ‘మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన ఇటీవలి కాలంలో గొప్పగా ఏమీ లేదు. ప్రదర్శన ఆధారంగా అతడు రూ.11 కోట్లకి ఎంపికవుతాడో లేదో చూడాలి. సిరాజ్ రూ.14 కోట్లకు చేరుకుంటాడని నేను అనుకోను. ఒకవేళ చేరుకున్నా.. ఆర్‌టీఎమ్‌ని ఉపయోగించుకుని తిరిగి ఆర్సీబీ జట్టులోకి తీసుకోవచ్చు’ అని ఆర్పీ సింగ్ అన్నాడు. ఆర్పీ గతంలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
‘ఆర్సీబీ ఫ్రాంఛైజీకి విరాట్ కోహ్లీని అట్టిపెట్టుకోవడానికి ఏ సమస్య లేదు. మిగతా ఆటగాళ్లని మాత్రం విడుదల చేయాలి. ఆ తర్వాత ఆర్‌టీఎమ్‌ను ఉపయోగించాలి. గత సీజన్‌లో మంచి ప్రదర్శన చేసిన రజత్ పటీదార్ ఈసారి రూ.11 కోట్ల కంటే ఎక్కువ లేదా తక్కువ ధర పలుకుతాడా అన్నది చూడాలి. వేలంలో పటిదార్ ధర రూ. 11 కోట్ల వరకు చేరుకున్నా ఆర్‌టీఎమ్‌ను ఉపయోగించవచ్చు. విరాట్ ఆర్సీబీ ఫ్రాంచైజీకి చాలా సహకారం అందించాడు. జట్టులో అతడు కీలక ఆటగాడు. విరాట్‌కు ఓ మంచి టీమ్‌ని ఇవ్వాలి. ఆర్సీబీలో కోహ్లీకి తప్ప మరెవ్వరికీ రూ.18 కోట్లు లేదా రూ.14 కోట్ల విలువ ఉన్నట్లు నాకు అనిపించడం లేదు’ అని ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.