సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఓటముల్లో హ్యాట్రిక్ కొట్టింది. బ్యాటింగ్ వైఫల్యంతో ఐపీఎల్ 2025లో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. అంతేకాదు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 80 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. 201 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ (33; 21 బంతుల్లో 2×4, 2×6) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లు వైభవ్ అరోరా (3/29), వరుణ్ చక్రవర్తి (3/22) చెలరేగారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (60; 29 బంతుల్లో 7×4, 3×6), అంగ్క్రిష్ రఘువంశీ (50; 32 బంతుల్లో 5×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అజింక్య రహానే (38; 27 బంతుల్లో 1×4, 4×6) దూకుడుగా ఆడగా.. రింకు (32 నాటౌట్; 17 బంతుల్లో 4×4, 1×6) లయ అందుకున్నాడు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (7) నిరాశపరిచారు. సన్‌రైజర్స్ బౌలర్లు సిమర్‌జీత్ సింగ్, కమిన్స్, హర్షల్ పటేల్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చివరి 5 ఓవర్లలో కేకేఆర్ 78 పరుగులు రాబట్టింది.
201 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభం దక్కలేదు. ట్రావిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్ (2) త్వరగానే పెవిలియన్ చేశారు. వైభవ్ అరోరా రెండు వికెట్స్, హర్షిత్ రాణా ఓ వికెట్ తీశారు. ఈ సమయంలో కమిందు మెండిస్ (27; 20 బంతుల్లో 1×4, 2×6), నితీశ్ కుమార్‌రెడ్డి (19; 15 బంతుల్లో 2×4, 1×6) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో నితీశ్, కమిందు, అనికేత్ వర్మ (6) ఔటైపోవడంతో సన్‌రైజర్స్ 75/6తో ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్ కమిన్స్ (14)తో కలిసి హెన్రిచ్ క్లాసెన్ దూకుడుగా అదే ప్రయత్నం చేశాడు. ఓవర్ వ్యవధిలో ఈ ఇద్దరు అవుట్ అవ్వడంతో సన్‌రైజర్స్ ఆశలు గల్లంతయ్యాయి.