సోమవారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్ పాండ్యా (42; 15 బంతుల్లో 3×4, 4×6)లు పోరాడినా సొంత మైదానంలో ముంబైకి ఓటమి తప్పలేదు. లక్నోతో ఆడిన మ్యాచ్‌లోనూ ఎంఐ 12 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. లక్నో మ్యాచ్‌లో తిలక్ వర్మ ‘రిటైర్డ్ ఔట్’ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. బెంగళూరుపై తిలక్ హాఫ్ సెంచరీ చేయడంతో ఎంఐ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై మరోసారి విమర్శలు వచ్చాయి. దీనిపై ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి స్పందించాడు.
‘ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ బాగా ఆడాడు. గత మ్యాచ్‌లో ఎన్నో విషయాలు జరిగాయి. బయట వ్యక్తులకు ఏమీ తెలియదు. లక్నో మ్యాచ్‌కు ముందు రోజు తిలక్‌కు బంతి బలంగా తాకింది. రిటైర్డ్ ఔట్‌గా ప్రకటించడం వెనక వ్యూహం ఉంది కానీ.. తిలక్ వేలికి గాయమైంది నిజం. గాయం కారణంగా అతడు దూకుడుగా ఆడలేకపోయాడు. కోచ్ నిర్ణయం మేరకు తిలక్‌ను పిలిపించి.. కొత్త బ్యాటర్‌తో ఎటాక్ చేయించాలన్నది మా ప్లాన్. కోలుకున్న తిలక్ ఈరోజు ద్భుతంగా ఆడాడు’ అని ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. తొలి భారత బ్యాటర్‌గా..!
హార్దిక్ పాండ్యా మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ‘వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. బౌలర్లను ఏం తప్పుపట్టలేం. మా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆప్షన్స్ లేవు. సాధారణంగా నమన్ ధిర్ డౌన్ ఆర్డర్‌లో వస్తాడు. లక్నో మ్యాచ్‌లో కాస్త ముందుకు వచ్చాడు. రోహిత్ శర్మ అందుబాటులో లేడు కాబట్టి.. నమన్ ముందుకొచ్చాడు. ఈరోజు రోహిత్ ఆడాడు కనుక నమన్‌ను లోయర్ ఆర్డర్‌కు పంపించాం. ఈ మైదానంలో 220 పైగా స్కోరును ఛేదించడం కష్టమేం కాదు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడంతో వెనకపడిపోయాం. కొన్ని ఓవర్లలో పరుగులు రాకపోవడంతో ఇంకా ఇబ్బందిపడ్డాం. జస్ప్రీత్ బుమ్రా మైదానంలోకి దిగడం ఆనందంగా ఉంది. అతడు వికెట్స్ తీస్తాడు’ అని ధీమా వ్యక్తం చేశాడు.