మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో వేలం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ ఇప్పటికే పూర్తి చేసింది. మెగా వేలానికి 1,574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు 574 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఈ 574 మందిలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి వేలంలో భారత స్టార్ క్రికెటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
ఇండియన్ స్టార్స్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీలు వేలంలో ఉన్నారు. షమీ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వస్తున్నాడు. అయితే అతడు ఈసారి పెద్ద మొత్తం దక్కించుకోవడం కష్టమేనని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. గాయమే అందుకు కారణమని వివరించాడు. ఈ వ్యాఖ్యలపై షమీ స్పందిస్తూ.. మంజ్రేకర్‌కు కౌంటర్ ఇచ్చాడు. బాబాకి జయహో అంటూ భవిష్యత్తు కోసం కాస్త జ్ఞానాన్ని ఉంచుకోండని ఎద్దేవా చేశాడు. ‘బాబాకి జయహో. మంజ్రేకర్ జీ.. మీ భవిష్యత్తు కోసం కాస్త జ్ఞానం ఉంచుకోండి. తప్పకుండా అది ఉపయోగపడుతుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు.
Also Read: Rare Painting: ఇది విన్నారా?.. రూ.1021 కోట్లు పలికిన పెయింటింగ్!
‘ఐపీఎల్ వేలంలో ప్రాంఛైజీలు ఎలాంటి ప్లేయర్లను తీసకుంటాయనేది చూడాలి. మహ్మద్ షమీ గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడదే అతడి ధరను నిర్ణయిస్తుంది. గాయాల కారణంగా భారీ మొత్తం వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉండవు. షమీలో ఈసారి ధర తగ్గుతుంది’ అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం షమీ క్రికెట్ ఆడలేదు. గాయం నుంచి కోలుకుని ఇటీవలే రంజీ ట్రోఫీలో బరిలోకి దిగిన అతడు.. ఏడు వికెట్లతో సత్తా చాటాడు. త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుతో కలవనున్నాడు.