ఐపీఎల్ 2024కు సమయం ఆసన్నమైంది. మార్చి 22న ఆరంభం మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌ను ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 5 సార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. ముంబై కెప్టెన్సీ మార్పు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు స్పందించాడు.
ఐపీఎల్ 2025 సీజన్ ముందు ముంబై ఇండియన్స్‌ను విడిచి.. చెన్నై సూపర్ కింగ్స్‌కు రోహిత్ శర్మ వెళ్లాలని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. ఎంఎస్ ధోనీ అనంతరం రోహిత్ సీఎస్‌కే పగ్గాలు చేపడితే బాగుంటుందన్నాడు. రోహిత్ మరో 5-6 ఏళ్ల పాటు ఐపీఎల్‌లో ఆడతాడని రాయుడు పేర్కొన్నాడు. ‘రోహిత్ శర్మ భవిష్యత్తులో సీఎస్‌కే తరఫున ఆడితే చూడాలనుకుంటున్నాను. ముంబై ఇండియన్స్ కోసం అతడు చాలా కాలం ఆడాడు. సీఎస్‌కే తరఫున ఆడి టైటిల్ గెలిస్తే బాగుంటుంది. అయితే కెప్టెన్‌గా ఉండాలా? వద్దా? అనేది అతడి ఇష్టం. మరో 5-6 ఏళ్ల పాటు రోహిత్ ఐపీఎల్ ఆడగలడు. 2025లో సీఎస్‌కేకు రోహిత్ ఆడాలని కోరుకుంటున్నా. ఎంఎస్ ధోనీ వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ జట్టును నడిపించవచ్చు’ అని రాయుడు అన్నాడు.
Also Read: Rishabh Pant-IPL 2024: రిషబ్ పంత్‌కు లైన్‌క్లియర్.. ఐపీఎల్ 2024లో పునరాగమనం!
ఐపీఎల్ 2025 ముందు మెగా వేలం జరగనుంది. మెగా వేలం కాబట్టి ఐపీఎల్ రూల్స్ ప్రకారం ముగ్గురు ఆటగాళ్లనే ప్రాంచైజీ అట్టిపెట్టుకోవాలి. ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మను ముంబై వదిలేసే అవకాశం ఉంది. ఒకవేళ ఐపీఎల్ 2025 వేలంకు రోహిత్ వస్తే.. అన్ని ప్రాంఛైజీలు ఎగబడడం ఖాయం.