iPhone 15 to Come India along with Global: యాపిల్ కంపెనీ నుంచే వచ్చే ‘ఐఫోన్ 15’ రిలీజ్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు 12న ఉదయం ఐఫోన్ 15 ఫోన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యావత్ ప్రపంచంతో పాటే.. భారత్ కూడా కొత్త ఐఫోన్‌ను అన్‌బాక్స్ చేయనుంది. లాంఛ్ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే భారత్‌లోనూ ఐఫోన్ 15 అమ్మకానికి అందుబాటులో ఉండొచ్చని సమాచారం తెలుస్తోంది. ఐఫోన్ 15 తయారీ కోసం ఇప్పటికే చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. సెప్టెంబరులో తయారీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
సాధారణంగా ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దాదాపు నెల తర్వాత భారత్‌కు వస్తుంటుంది. అయితే ఈసారి ఆ గ్యాప్‌ను పూర్తిగా తగ్గించే ప్రయత్నాల్లో యాపిల్ కంపెనీ ఉందని తెలుస్తోంది. 2022లో చెన్నైలోని ప్లాంట్‌లో ఐఫోన్ 14 తయారీ గ్లోబల్ లాంఛ్ తర్వాత 10 రోజులకు ప్రారంభమైంది. ఇక ఫోన్ మార్కెట్‌లోకి రావడానికి నెల రోజుల పైనే పట్టింది. ఐఫోన్ 15కు గ్యాప్ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండేలా యాపిల్ ప్లాన్ చేస్తోందట.
భారత దేశంలో తయారు చేసిన ఐఫోన్ 15 ఫోన్లను మొదట ఇక్కడే విక్రయించాలని యాపిల్ కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత్ తర్వాతే ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారట. దసరా, దీపావళి పండగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్‌లో డిమాండ్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. డిసెంబర్ తర్వాతే అమెరికా, ఐరోపా దేశాలకు ఐఫోన్ 15 ఫోన్ల ఎగుమతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
Also Read: Best Jio Plans: జియో సిమ్ యూజర్లకు గుడ్‌న్యూస్..బెస్ట్ 5 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
ఐఫోన్ 15 తయారీ చైనాలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో గత జూన్‌లో ప్రారంభం అయినట్టు సమాచారం. అదే సమయంలో భారత్‌లోని తయారీ కేంద్రాలకు కూడా పరికరాలు సరఫరా అయ్యాయట. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తుల తయారీలో భారత్ వాటా 7 శాతం అన్న విషయం తెలిసిందే. భారత్‌లో ఫాక్స్‌కాన్, విస్త్రోన్, పెగాట్రాన్ సంస్థలు యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. 2023-24 నాటికి రూ. 61000 కోట్ల విలువ చేసే ఎగుమతుల లక్ష్యాన్ని చేపెట్టుకున్నాయి.