Janasena: బీజేపీ సారథ్యంలో ఎన్డీయే సమావేశంలో పాల్గొనాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఆహ్వనం అందింది. ఇప్పటికే భాగస్వామ్య పక్షాల అగ్రనాయకులకు ఆహ్వానం పంపిన బీజేపీ అధిష్ఠానం, తాజాగా పవన్‌ను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీన ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి హాజరవుతామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 2014 ఎన్నికల తర్వాత జరిగిన ఎన్డీఏ మిత్ర పక్షాల సమావేశానికి తొలిసారిగా వెళ్లిన పవన్.. మళ్లీ ఇప్పుడు వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు మందు ఈ సమావేశం ఢిల్లీలో జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులకు మద్దతు కోరడం, రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల బల ప్రదర్శన లక్ష్యంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 18వ తేదీన ఢిల్లీలో ఎన్డీయే భాగస్యామ్య పార్టీల సమావేశం జరగనుంది. ఢిల్లీ అశోక హోటల్‌లో జరగనున్న ఈ భేటీకి పాత, కొత్త మిత్రుల్ని బీజేపీ పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం నేపథ్యంలో పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీకి కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఆహ్వానించినట్లు వార్తలు వస్తుండగా.. ఆహ్వానం అందితే మాత్రం చంద్రబాబు కచ్చితంగా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేనకు ఆహ్వానం అందగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.