CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని అన్నారు. తెలంగాణ అంటేనే వ్యాపారం.. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ఈ సందర్భంగా సీఎం వివరించారు. త్వరలోనే హైదరాబాద్లో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఇది భారత దేశపు భవిష్యత్తుకు చిరునామాగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. దేశంలోనే జీరో కార్బన్ సిటీ ఇక్కడ ఏర్పడతుందని అన్నారు. ఫ్యూచర్ సిటీలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు, మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్దితో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను సులభతరం చేస్తామని సీఎం ప్రకటించారు. అటువంటి సరికొత్త ఆలోచనలతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.
Read Also: Hyderabad: ఆక్రమణలపై హైడ్రా కొరడా.. చెరువులో అక్రమ నిర్మాణాలు తొలగింపు
సోమవారం న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వర్కింగ్ లంచ్ అనంతరం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశమయ్యారు. ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నఛైర్‌పర్సన్‌లు, సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తన మనసులోని మాటలతో పాటు తమ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో.. తన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలేమిటో వెల్లడిస్తానంటూ అందరినీ ఉత్సాహపరిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఇది తన మొదటి అమెరికా పర్యటన అని.. ఇక్కడి నుంచి వీలైనన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్లాలలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు.
పెట్టుబడుల గమ్యస్థానంగా దేశంలోనే అందరినీ ఆకర్షిస్తున్న తెలంగాణకు ఉన్న అనుకూలతలన్నింటినీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్, లైఫ్-సైన్స్, ఫార్మా రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలలో బలమైన పునాదులు వేసుకుందని చెప్పారు. కోవిడ్ను అధిగమించేందుకు మిలియన్ల కొద్దీ వ్యాక్సిన్‌లను తయారు చేసి ప్రపంచానికి సాయం చేసిందని అన్నారు. తెలంగాణలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ సంపద సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమమైన మద్దతును అందిస్తుందని ప్రకటించారు. నిజాంలు నిర్మించిన 425 సంవత్సరాల పురాతనమైన హైదరాబాద్, ఇంచుమించుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సమకాలీనంగా ఉండటం ఆసక్తి రేపుతోందని అన్నారు.
Read Also: Telangana: అమెరికాలో రేవంత్ పర్యటన.. హైదరాబాద్‌లో మరిన్ని ఉద్యోగాలు
అభిరుచితో పాటు అద్భుతమైన దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఒకసారి తెలంగాణకు రావాలని, హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్లో ఉన్న అనుకూలతలతో పాటు అక్కడున్న అవకాశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కలిసికట్టుగా గొప్ప భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణను చైనాకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి దార్శనికతను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రపంచంలోనే టాప్ టెన్ సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని, ఆ దిశగా రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించారు. ఈ సమావేశం తెలంగాణలో కొత్త పెట్టుబడులకు మరింత ఊతమిస్తుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో కార్నింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్క్లీరెన్, కేకేఆర్ పార్టనర్ దినేష్ పలివాల్, సిగ్నా ఇంటర్నేషనల్ పబ్లిక్ పాలసీ హెడ్ ఎక్రమ్ సర్పర్, న్యూజెర్సీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బిల్ నూనన్, సేఫ్‌సీ గ్రూప్ ఛైర్మన్ ఎస్వీ అంచన్, టిల్మాన్ హోల్డింగ్స్ ఛైర్మన్ సంజీవ్ అహుజా, అమ్నీల్ ఫార్మా కో సీఈవో చింటూ పటేల్, జేపీ మోర్గాన్ చేజ్ ఈడీ రవి లోచన్ పోలా, ఆక్వాటెక్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) సుబ్బారావు, యాక్సెంచర్ ఎండీ అమిత్కుమార్, డెలాయిట్ ఎండీ పునిత్ లోచన్, హాబిట్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వీర బుద్ధి, బీఎన్వై మెల్లన్ ఎండీ అట్లూరి, పేస్ యూనివర్సిటీ డీన్ డా. జోనాథన్ హిల్, అకుజెన్ చీఫ్ సైంటిఫిక్ హెడ్ అరుణ్ ఉపాధ్యాయ, ఎస్ అండ్ పీ గ్లోబల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్వామి కొచ్చెర్లకోట, ఇంటర్కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్ ఎండీ అశ్విని పన్సే ఈ సమావేశంలో పాల్గొన్నారు.
@IndiainNewYork hosted Hon’ble Chief Minister of Telangana, Shri A. Revanth Reddy @revanth_anumula for a CEO roundtable. Twenty Chairmen/CEOs representing well-known companies from the pharma, IT, technology, EV, GCC, biotech, and shipping sectors, among others, discussed their… pic.twitter.com/zNVzRMUBuL
— India in New York (@IndiainNewYork) August 5, 2024