Gangster Salman Lala: మధ్యప్రదేశ్‌లోని మినీ ముంబైగా పేరుగాంచిన ఇండోర్ వ్యాపారం, విద్య, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. కానీ నేడు ‘సల్మాన్ లాలా’ అనే గ్యాంగ్‌స్టర్ కారణంగా ముఖ్యాంశాలలో నిలిచింది. చాలా మంది యువత ఆ గ్యాంగ్‌స్టర్‌పై రీల్స్ తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చిత్రాలను పంచుకుంటున్నారు. ‘హీరో’ మాదిరిగా వైరల్ చేస్తున్నారు. కానీ ఆ గ్యాంగ్‌స్టర్ హీరో కాదు. క్రూరమైన వ్యక్తి. అలాంటి పెద్ద గ్యాంగ్‌స్టర్ చనిపోతే అంత్యక్రియలకు వేలాది మంది హాజరు కావడం గమనార్హం. అసలు ఎవరు ఈ సల్మాన్ లాలా? ఒక సాధారణ యువకుడు ఇండోర్‌లో ప్రసిద్ధ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు? ఎలా చనిపోయాడు? బాలివుడ్ నటులు ఎందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
READ MORE: Building Collapse : గురుకుల పాఠశాలలో కూలిన భవనం.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
సల్మాన్ లాలా అలియాస్ షానవాజ్ ఇండోర్‌లోని ఒక సాధారణ కుటుంబానికి చెందినవాడు. మొదట్లో అతనికి ఏ పెద్ద నేరాలతో సంబంధం లేదు. కానీ కాలక్రమేణా చిన్న వివాదాలు, భూ కబ్జాలు, దోపిడీ, అక్రమ వ్యాపారాల్లో ఈ పేరు వినిపించడం ప్రారంభమైంది. నెమ్మదిగా సల్మాన్ తన స్థానిక నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నాడు. ఈ క్రమంలో అతనిపై అనేక ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అయినప్పటికీ ఆ ప్రాంతంలో అతన్ని ‘హీరో’గా చూశారు. సల్మాన్ లాలా చిన్న వయసులోనే ఇండోర్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. ఉజ్జయిని పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ దుర్లభ్ కశ్యప్ లాగా బలమైన క్రిమినల్ నెట్‌వర్క్‌ను నిర్మించాడు.
హత్య, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా (NDPS చట్టం), హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి అతనిపై మొత్తం 32 కి పైగా కేసులు నమోదయ్యాయి. అంతే కాదు.. అతడి కుటుంబీకులు కూడా అనేక నేరాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు సల్మాన్ లాలాను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. సోదరుడు సిద్ధు అలియాస్ షాదాబ్ ఇటీవలే సాగర్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ అదనపు డీసీపీ రాజేష్ దండోటియా వివరాల ప్రకారం.. సల్మాన్ లాలా తన సోదరుడు సిద్ధు అలియాస్ షాదాబ్‌ను సాగర్ జైలు నుంచి పికప్ చేసుకుని ఇండోర్‌కు తిరిగి వస్తుండగా పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. ఈ సమయంలో సల్మాన్ లాలా పారిపోతూ సెహోర్ జిల్లాలోని ఒక చెరువులోకి దూకి లోతైన నీటిలో మునిగి మరణించాడు.
మరోవైపు.. సల్మాన్ లాలా అలియాస్ షాదాబ్ మరణం తర్వాత కుటుంబం పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. పోలీసులే హత్య చేశారని ఆరోపించింది. పోలీసులు చెరువులో ముంచి చంపారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ అంశంపై అదనపు డీసీపీ డెడోటియా వివరణ ఇచ్చారు. పోస్ట్‌మార్టం నివేదిక మునిగిపోయినట్లు నిర్ధారించిందని చెప్పారు. సల్మాన్ పరిగెడుతూ దూకాడని, చీకటిలో లోతును అంచనా వేయలేకపోయాడని తెలిపారు.
బాలీవుడ్ సంబంధం: ఎజాజ్ ఖాన్ ప్రకటన
సల్మాన్ లాలాకు బాలీవుడ్లో కూడా సంబంధాలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ సల్మాన్ లాలా మరణంపై ముంబైకి చెందిన బాలీవుడ్ నటుడు ఎజాజ్ ఖాన్, నటుడు వివేక్ ఒబెరాయ్ విచారం వ్యక్తం చేయడంతో ఇది రుజువైంది. ఎజాజ్ ఖాన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. సల్మాన్ లాలా చెరువులో మునిగి చనిపోయాడని చెబుతన్నారు. కానీ.. అతను గజఈతగాడు అని నేను అనుకుంటున్నాను. పెద్ద సముద్రంలో ఈత కొట్టే సామర్థ్యం ఉన్న వ్యక్తి చెరువులో మునిగి చనిపోడు అంటూ వీడియోలో పేర్కొన్నాడు.
READ MORE: Nepal Protest: ఖాట్మాండు వీధుల్లో ఆర్థిక మంత్రిని ఉరికించి కొట్టారు.. వీడియో వైరల్..
ఇది పక్కన పెడితే.. స్థానికుల సమాచారం ప్రకారం.. సల్మాన్ లాలా నెమ్మదిగా తన ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకున్నాడు. మొదట చిన్న చిన్న నేర కార్యకలాపాలలో పాల్గొన్నాడు. నేర నెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు. గ్యాంగ్‌స్టర్ సల్మాన్ లాలాకు కేవలం 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతనిపై మూడు అత్యాచార కేసులు నమోదయ్యాయి. 28 సంవత్సరాల వయస్సులో అతనిపై మొత్తం 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో అనేక హత్య, మాదకద్రవ్యాల కేసులు కూడా ఉన్నాయి. అతని పేరు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ.. అతని నెట్వర్క్ మాత్రం సోషల్ మీడియాలో విస్తరిస్తూనే ఉంది. మరోవైపు.. సల్మాన్ లాలా తన పట్టణంలో పేదలకు, నిస్సహాయులకు ఆర్థిక సహాయం చేస్తూ వచ్చాడని.. వివాదాలను పరిష్కరించడంలో, పేదలకు సహాయం చేయడంలో అతడి పాత్ర వల్ల ప్రజల్లో అతనికి ఒకరకమైన అభిమానం ఏర్పడిందని చెబుతున్నారు.