ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సరిపడ ఇంధనం లేకపోకపోవడంతో కెప్టెన్ ‘మేడే కాల్’ చేశాడు. దీంతో విమానం బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా.. తాజాగా బయటకు వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే.. గురువారం సాయంత్రం 4.40 గంటలకు ఇండిగో విమానం 6E-6764 (A321) గౌహతి నుంచి చెన్నై బయలుదేరింది. సాయంత్రం 7.45 గంటల ప్రాంతంలో చెన్నైలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే విమానం చెన్నై ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించిన తర్వాత సరిపడా ఇంధన నిల్వలు లేవని పైలెట్ గుర్తించారు. వెంటనే ఏటీసీకి ‘మేడే’ సందేశం పంపారు. దీంతో విమానాన్ని బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు.
READ MORE: Bolisetti Srinivas: రప్పా.. రప్పా.. నరకడానికి ఆయన ఏమైనా స్టేట్ రౌడీనా..?
మేడే కాల్ అంటే ఏంటి?
ఒక విమానం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, పైలట్ మేడే కాల్ పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్ (అత్యవసర సంకేతం). విమానం ఇబ్బందుల్లో ఉందని ఈ కాల్ సూచిస్తుంది. ‘మేడే’ అనే పదం ఫ్రెంచ్ పదబంధం “మైడర్” నుంచి ఉద్భవించింది. దీని అర్థం ‘నాకు సహాయం చేయండి’ అని. విమానం మాదిరే పడవలు కూడా అత్యవరసర పరిస్థితుల్లో ఈ కాల్‌ను ఉపయోగిస్తాయి. మేడే పదాన్ని 1923 నుంచి ఆంగ్లంలోనూ వాడుతున్నారు. 1927లో అమెరికా అధికారికంగా రేడియో అత్యవసర పరిస్థితులకు దీనిని ఉపయోగించడం ప్రారంభించింది. కంట్రోల్ టవర్ దృష్టికి పరిస్థితి తీసుకెళ్లడానికి లేదా పరిస్థితి తీవ్రతను నొక్కి చెప్పడానికి ‘మేడే, మేడే, మేడే’ అని రిపీటెడ్‌గా చెబుతారు.