Rice Export Ban: అన్నమో రామచంద్రా.. అనేది మనం సామెతల్లో తరచు వింటుంటాం. అయితే ఇపుడు ఎన్‌ఆర్‌ఐలు…బియ్యయో రామచంద్రా అన్న పరిస్థితి ఏర్పడింది. చిన్నతనంలో రిలీజ్ రోజు సినిమా టికెట్ల కోసం ఎగబడినట్టు…అమెరికాలోని భారతీయులు బియ్యం కోసం ఎగబడుతున్నారు. అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు… తెలవారుతూనే షాపింగ్ మాల్స్‌కు క్యూకట్టారు. సూపర్ మార్కెట్లలోకి ఎగబడి…బస్తాల కొద్దీ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. సూపర్ మార్కెట్లలో సోనామసూరి బియ్యం ప్యాకెట్లు క్షణాల్లో ఖాళీ అవుతున్నాయి.. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై మోడీ సర్కార్ నిషేధం విధించింది. దీంతో బియ్యం ఎక్కువగా తినే…భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని షాపింగ్ మాల్స్‌లో.. ఎన్నడూ లేని విధంగా బియ్యరం ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. సోనామసూరి బియ్యం ధరలు రెండింతలు, మూడింతలు పెంచేశారు. బియ్యం ధరలు పెరిగిన భారతీయులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గంటల కొద్దీ షాపింగ్ మాల్స్ ముందు నిలబడి.. 10, 15 బస్తాలను కొనుగోలు చేస్తున్నారు. కాలిఫోర్నియా, డల్లాస్, వాషింగ్టన్, లాస్‌ఎంజెల్స్, నార్త్ కరోలినా, ఫ్లోరిడా, నెవడా, న్యూయార్క్, వర్జినియా వంటి ప్రాంతాల్లో బియ్యానికి డిమాండ్ పెరిగింది.
బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం ఎప్పుడు ఎత్తేస్తుందోనన్న భయంతో.. అవసరానికి మించి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన దుకాణదారులు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు. ఒకరికి ఒక బియ్యం బస్తానే విక్రయిస్తామంటూ రాసిపెట్టారు. 15 డాలర్ల విలువ చేసే కిరాణ సామాన్లు కొంటేనే బియ్యం బ్యాగు కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఒక కస్టమర్‌ను ఒకసారి మాత్రమే షాపులోకి అనుమతిస్తామని షరతులు విధించారు. సోనా మసూరిలో ఏ రకం బియ్యం తీసుకున్నా.. ఒక్క కుటుంబానికి ఒక్క బియ్యం బస్తా మాత్రమే విక్రయిస్తామని కండిషన్లు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరు నెలల కిందట గోధుమల ఎగుమతులు ఆపేసి, విదేశాల్లోని ఉత్తరాది భారతీయులను దెబ్బకొట్టిన మోడీ…ఈ సారి బియ్యం ఎగుమతులు నిషేధించి దక్షిణ భారతీయులకు షాక్ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. పొద్దున్న బియ్యం ఎగుమతులపై నిషేధం వార్త బయటకు వచ్చిందో లేదో… అమెరికాలోని భారతీయులు…ఇండియన్ స్టోర్లకు పరుగులు పెట్టారు. నిన్నటి దాకా 20 డాలర్లు ఉన్న 10 కేజీల బ్యాగ్, నిషేధంతో 30 డాలర్లకు పెంచేశారు. కొన్ని చోట్ల 50 డాలర్లకు విక్రయిస్తున్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి సన్న బియ్యం మొత్తం ఎగుమతి 4.2 మిలియన్ల డాలర్లకు చేరువలో ఉంది. అంతకుముందు ఏడాదిలో ఎగుమతులు 26.2 మిలియన్లు డాలర్లుగా ఉండేది. థాయ్‌లాండ్, ఇటలీ, స్పెయిన్, శ్రీలంక, అమెరికాకు సన్న బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో ఖరీఫ్‌లో పంటల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బియ్యాన్ని కొద్దిరోజుల పాటు నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, దేశీయంగా బియ్యం ధరలకు రెక్కలు రావడంతో.. మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, పాలిష్ చేయని తెల్లటి బియ్యం ఎగుమతులను నిషేధించింది. నోటిఫికేషన్ వెలువడడానికి కంటే ముందే ఓడలో బియ్యాన్ని లోడ్ చేయడం ప్రారంభించి ఉంటే అలాంటి ఎగుమతులకు అనుమతిస్తామని డీజీఎఫ్‌టీ వెల్లడించింది.
ఆహార భద్రత అవసరాల కింద ప్రభుత్వం అనుమతించిన దేశాలకు బియ్యం ఎగుమతులను మినహాయింపు ఇచ్చింది. బాస్మతి, ఉప్పుడు బియ్యం రకాలకు ఈ ఆంక్షలు వర్తించవని, వాటి ఎగుమతులు యథాతథంగా కొనసాగుతాయని కేంద్రం వెల్లడించింది. మన దేశ బియ్యం ఎగుమతుల్లో బాస్మతియేతర తెల్ల బియ్యం వాటా 25శాతంగా ఉంటోంది. దేశీయ రిటైల్ మార్కెట్లో ఏడాది వ్యవధిలో బియ్యం ధరలు 11.5శాతం మేర, గత నెల వ్యవధిలో 3శాతం మేర పెరిగాయ్. 2022 సెప్టెంబరు-2023మార్చి మధ్య కాలంలో బాస్మతియేతర బియ్యం ఎగుమతులు 42.12 లక్షల టన్నులకు చేరుకున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీంతో చాలా చోట్ల వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా మరికొన్ని చోట్ల పంట నాశనమైంది. ముఖ్యంగా ఉత్తరాదిలో పంజాబ్, హర్యాణాలో పంట దెబ్బతింది. దీంతో బియ్యం ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన సర్కారు బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలోనూ బియ్యంపై కేంద్రం నిషేధం విధించింది. సరఫరా సమృద్ధిగా ఉన్న సందర్భాల్లో ఎత్తివేసింది.
అంతర్జాతీయంగా 1.20లక్షలకుపైగా వరి రకాలను సాగు చేస్తున్నారు. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు. ప్రపంచంలో 90శాతం కంటే ఎక్కువ బియ్యం ఆసియాలో ఉత్పత్తి అవుతోంది. అధికంగా వినియోగించేంది కూడా ఆసియాలోనే. బాస్మతి అనేది భారత్, పాకిస్థాన్, నేపాల్ దేశాల్లో సంప్రదాయంగా పండించే సుగంధ వరి రకం. ఈ బియ్యానికి ఉన్న సువాసన, రుచి కారణంగా ప్రపంచంలోనే ఉత్తమ రకంగా పరిగణిస్తున్నారు. భారత్‌లో బాస్మతి రకాన్ని జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లలో అధికంగా పండిస్తారు. మొత్తం ఉత్పత్తిలో హర్యానాది 60శాతం వాటా. మనదేశంలో 27 రకాల బాస్మతి రకాలను సాగు చేస్తున్నారు. 1966 విత్తన చట్టం ప్రకారం ఇప్పటిదాకా 34 రకాలను నోటిఫై చేశారు. భారత్ 2012 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా కొనసాగుతోంది.
ప్రస్తుతం అంతర్జాతీయ బియ్యం వ్యాపారంలో 45శాతం వాటాను సాధించింది. దీనికితోడు, బాస్మతి బియ్యం వాణిజ్యంలో దాదాపు 80శాతం వాటా మన దేశానిదే. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం, భారత్ నుంచి 2022-23లో 149దేశాలకు బాస్మతి బియ్యం ఎగుమతి అయ్యాయి. 2024లో భారత్ ప్రపంచంలో అత్యంత పోటీతత్వ ధర కలిగిన బియ్యం ఎగుమతిదారుగా కొనసాగుతుందని అమెరికా అంచనా వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకిలా.. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది.. అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ నిషేధం వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక.. భారత్‌లో ఆహార సంక్షోభం వస్తుందనే భయంలో…కేంద్ర ప్రభుత్వం ఉందా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.