LPG Tankers Cross Strait of Hormuz: గుడ్‌న్యూస్.. హర్మూజ్ జలసంధి నుంచి రెండు భారతీయ గ్యాస్ నౌకల ప్రయాణం..!

  • హర్మూజ్ జలసంధి వద్ద తగ్గిన ట్రాఫిక్..
  • మరో రెండు భారతీయ నౌకలు ఇండియాకు వచ్చే అవకాశం..
  • ప్రస్తుతం షార్జా తీరాన ఉన్న గ్యాస్ నౌకలు..
Lpg

Lpg

పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో గత కొన్ని రోజులుగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సముద్ర మార్గంలో రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇరాన్ పక్కన ఉండే ‘హార్ముజ్ జలసంధి’ సముద్ర మార్గం గుండా వెళ్లాలంటే ఓడలు భయపడుతున్నాయి. అయితే.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారతదేశానికి చెందిన రెండు పెద్ద గ్యాస్ నౌకలు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి.

ఏమిటా నౌకలు..? ఎక్కడున్నాయి..?

భారతదేశానికి చెందిన ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ అనే రెండు భారీ నౌకలు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని షార్జా తీరానికి సమీపంలో ఆగి ఉన్నాయి. ఇవి వంట గ్యాస్‌ను మోసుకెళ్లే నౌకలు. గత 24 గంటలుగా ఈ మార్గంలో చమురు రవాణా చేసే ఓడలేవీ కదలలేదు. కానీ… తాజా సమాచారం ప్రకారం ఈ రెండు భారతీయ నౌకలు శనివారం తమ ప్రయాణాన్ని మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. నౌకల కదలికలను గమనించే సాఫ్ట్‌వేర్ల ద్వారా ఈ విషయం బయటపడింది.

అసలు సమస్య ఏమిటి..?

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, గ్యాస్‌లో దాదాపు 20 శాతం ఈ హార్ముజ్ మార్గం గుండానే వెళ్లాలి. కానీ.. ఇరాన్ హెచ్చరికల వల్ల ఇక్కడ రాకపోకలు ఆగిపోయాయి. అమెరికా ఆంక్షలు ఉన్న ఒక ఖాళీ నౌకను కూడా ఇరాన్ వెనక్కి పంపించేసింది. ఇలాంటి సమయంలో మన నౌకలు ముందుకు వెళ్లడం అనేది చాలా కీలకమైన విషయం.

Also Read:Chicken Price Hike: రంజాన్ వేళ.. చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..

భారత ప్రభుత్వం ఏమంటోంది..?

మన దేశానికి చెందిన దాదాపు 22 నౌకలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నాయి. మన ఓడల భద్రత విషయంలో భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంది. ‘మా నౌకలు సురక్షితంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించాలని మేము కోరుకుంటున్నాము’ అని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇతర దేశాల నాయకులతో ఈ విషయంలో మాట్లాడుతున్నారు.

గత వారంలో కూడా ఇరాన్ ప్రభుత్వం మన దేశానికి చెందిన రెండు గ్యాస్ నౌకలను వెళ్లడానికి అనుమతించింది. దీనిని బట్టి చూస్తుంటే.. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ నౌకలకు కొంత మినహాయింపు దొరుకుతుందని అర్థమవుతోంది. ఒకవేళ ఇప్పుడు ఈ రెండు నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తే, రాబోయే రోజుల్లో మిగిలిన వ్యాపార నౌకలు కూడా ధైర్యంగా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది.