Singapore : సింగపూర్‌లో భారతీయ కార్మికుడికి 400 సింగపూర్ డాలర్ల జరిమానా విధించారు. మద్యం మత్తులో బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేశాడని ఆరోపించారు. సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్‌లో ఉన్న షాప్స్ మాల్ ప్రవేశద్వారం వద్ద మలవిసర్జన చేసినందుకు కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. తీర్పు వెలువరిస్తూనే.. ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదని హెచ్చరించిన జడ్జి.. మరోసారి ఇలా చేస్తే కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు.
ఈ సంఘటన గత సంవత్సరం అక్టోబర్ 30 న జరిగింది. ఫేస్‌బుక్‌లో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇది రెండు రోజుల్లో 1500 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. ఆ పోస్ట్‌పై 1,700 కంటే ఎక్కువ కామెంట్స్ చేశారు. ఇది 4,700 సార్లు షేర్ చేశారు. ఈ పోస్ట్ సింగపూర్‌లో చాలా హెడ్‌లైన్స్ చేసింది. ఈ పోస్ట్‌లో సింగపూర్‌లోని ఒక మాల్ గేటు వద్ద ఒక కార్మికుడు మలవిసర్జన చేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తిని సింగపూర్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న భారతీయుడైన రాము చిన్నరసగా గుర్తించారు.
నిర్మాణ కార్మికుడు రాము చిన్నరస పబ్లిక్ శానిటేషన్ నిబంధనల ప్రకారం నేరాన్ని అంగీకరించాడు. అక్టోబర్ 30, 2023న రాము మూడు సీసాల మద్యం తాగి మరీనా బే సాండ్స్ క్యాసినోలో జూదం ఆడాడు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో, అతను క్యాసినో నుండి బయటకు వచ్చేశాడు. కానీ అతను విపరీతంగా తాగి, టాయిలెట్‌కు వెళ్లలేక మాల్ ప్రవేశద్వారం వద్ద మలవిసర్జన చేశాడు. దీని తర్వాత అతను మెరీనా బే సాండ్స్ వెలుపల ఒక రాతి బెంచ్ మీద పడుకున్నాడు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు క్రాంజీలోని తన వసతి గృహానికి తిరిగి వచ్చాడు. ఈ ఘటనపై డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (డిపిపి) అడెలె టై మాట్లాడుతూ, రామూ వీడియోను అదే రోజు భద్రతా అధికారి చూశారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.