Jai Shankar: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి విదితమే. వాషింగ్టన్ డీసీలో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచంలోని పలు దేశాల నేతలు హాజరు కానున్నారు. అయితే, భారతదేశ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొననున్నారు. మినిస్టరీ అఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకటన ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ – వాన్స్ కమిటీ ఆహ్వానం మేరకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపింది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి రాబోయే పరిపాలన ప్రతినిధులతో పాటు అమెరికాలో పర్యటించే మరికొందరు నాయకులను కూడా కలుస్తారని కూడా తెల్పింది.
Also Read: Cock Fights: రేపు ప్రారంభం కానున్న కోడి పందాలు.. పశ్చిమగోదావరి జిల్లాలో భారీ ఏర్పాట్లు!
జనవరి 20న జరగనున్న ఈ వేడుకలో జో బిడెన్ నుండి ట్రంప్‌కు అధికార మార్పిడి ఉంటుంది. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత, డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ వీధుల గుండా పరేడ్ చేస్తారు. ఆ తర్వాత ప్రజల నుండి శుభాకాంక్షలు స్వీకరిస్తారు. విదేశాంగ మంత్రి జైశంకర్ డిసెంబరు చివరి వారంలో అమెరికాను సందర్శించారు. అక్కడ ఆయన అనేక ఉన్నత స్థాయి సమావేశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైశంకర్ అమెరికా పరిపాలన అధికారులతో వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ సహకారంపై చర్చించారు. అమెరికా తదుపరి NSAతో సహా ట్రంప్ బృందంలోని అనేక మందిని కూడా కలిశారు.