కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు ఆ దేశంలోని భారత రాయబారి వార్నింగ్ ఇచ్చారు. నిజ్జర్ హత్య కేసు విషయంలో హద్దులు దాటుతున్నారంటూ.. మండిపడ్డారు. నిజ్జర్ హత్య కేసు విషయంలో కెనడాతో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సిక్కు వేర్పాటువాద గ్రూప్‌లు రెడ్‌లైన్ దాటుతున్నారని హెచ్చరించారు. కెనడా గడ్డ నుంచి భారత భద్రతకు పొంచి ఉన్న ముప్పు గురించే తన ప్రధాన ఆందోళన అని స్పష్టం చేశారు.
READ MORE: Sam Pitroda : మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా
నిజ్జర్ హత్య కేసును కెనడా గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు భారతీయులను ఇటీవల కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాలపై సంజయ్ వర్మ తొలిసారిగా స్పందించారు. ‘‘ద్వంద్వ జాతీయతను భారత్ ఎన్నటికీ గుర్తించదు. ఎవరైనా వలస వస్తే వారిని విదేశీయులుగానే పరిగణిస్తాం. భారత ప్రాదేశిక సమగ్రతపై దుష్టశక్తుల కన్ను పడింది. తమ స్వస్థలాన్ని భారత్ నుంచి విడదీయాలని చూస్తున్న కొందరు.. తమ చర్యలతో రెడ్‌లైన్ దాటుతున్నారు. దీన్ని న్యూదిల్లీ దేశ భద్రతకు ముప్పుగానే పరిగణించి నిర్ణయాలు తీసుకుంటుంది జాగ్రత్త..!’’ అని హెచ్చరించారు.
భారత్-కెనడా మధ్య దౌత్య విభేదాల గురించి ఆయన స్పందించారు. ‘‘ఇటీవల కొంతమంది భారత సంతతి కెనడియన్లు దశాబ్దాల క్రితం నాటి సమస్యలను మళ్లీ లేవనెత్తి ఇరు దేశాల మధ్య ప్రతికూల వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని కెనడా అపార్థం చేసుకోవడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. సమయం చూసుకుని దీనిపై ఇరు దేశాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటాయి’’ అని వర్మ అన్నారు. ఇటీవల కెనాడాలోని ఒంటారియోలో చేపట్టిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలు వెలుగుచూశాయి. ఈ అంశం వివాదాస్పదమైంది. ఇప్పటి వరకు కెనడాలోని భారత రాయబారి ఈ అంశంపై స్పందించలేదు. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. భారత్ దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.