Tri Series: శ్రీలంక వేదికగా జరిగిన మహిళల మూడు జట్ల వన్డే ట్రై సిరీస్ ఫైనల్లో భారత మహిళల జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నేడు కొలంబో (ఆర్‌పిఎస్) స్టేడియంలో శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మందాన మరోసారి తన తడాఖా చూపించింది. ఆమె 101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులతో 116 పరుగుల అద్భుత శతకం బాదింది. ఆమెకు తోడుగా హర్లీన్ డియోల్ (47), హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగ్స్ (44) పరుగులతో నిలిచారు. చివర్లో దీప్తి శర్మ (20 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. ఇక శ్రీలంక బౌలింగ్‌లో మాల్కీ మడారా, దెవ్మి విహంగా, సుగంధిక కుమారి చెరో రెండు వికెట్లు తీశారు.
Read Also: Google Pixel 8: డోంట్ మిస్.. ఆ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ పై ఏకంగా రూ.31,000 భారీ డిస్కౌంట్..!
ఇక 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళలు 48.2 ఓవర్లలో కేవలం 245 పరుగులకే ఆలౌట్ అయ్యారు. కెప్టెన్ చమారి అథపత్లు 51, నీలక్షిక సిల్వా 48 పరుగులతో రాణించినా, మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక భారత్ బౌలింగ్‌లో స్నేహ రానా 9.2 ఓవర్లలో 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. అమన్‌జోత్ కౌర్ 3 వికెట్లు తీయగా, శ్రీ చరణి ఒక వికెట్ తీసింది. దీనితో 97 పరుగుల తేడాతో భారత మహిళా జట్టు వన్డే ట్రై సిరీస్ ను కైవసం చేసుకుంది.
Read Also: Polycet 2025: పాలీసెట్-2025 పరీక్షకు సర్వం సిద్ధం.. ఒక్క నిమిషం ఆలస్యం అయిన ‘నో ఎంట్రీ’
ఇక ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ‘స్మృతి మందాన’ ఎంపిక అవ్వగా.. ప్లేయర్ అఫ్ ది సిరీస్ గా ‘స్నేహ రానా’ ఎన్నికైంది. ఇక ఈ మ్యాచ్ లో స్మృతి మందాన సెంచరీ చేయడంతో వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన మూడో మహిళగా రికార్డ్ సాధించింది.