India vs Pakistan: ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో భారత్ పాకిస్థాన్‌తో క్రమంగా అన్ని సంబంధాలను తెంచుకుంది. కానీ.. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఇరు దేశాలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ.. ఆదివారం శివసేన (UBT) మహారాష్ట్ర అంతటా వీధి నిరసనలు నిర్వహించింది. ఇది దేశ ప్రజల మనోభావాలను అవమానించడమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసనల్లో భాగంగా ముంబైలో యూబీటీ ప్రతినిధి ఆనంద్ దూబే.. ఒక టెలివిజన్ సెట్‌ను పగలగొట్టారు.
READ MORE: Siddipet : 8వ తరగతి విద్యార్ధినిపై తెలుగు టీచర్ ప్రణయ్ అత్యాచారయత్నం
తాము క్రికెట్‌కి వ్యతిరేకం కాదని.. పాకిస్థాన్‌తో ఆడటానికి వ్యతిరేకిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. నిరసనకారులు “భారత్ మాతా కీ జై” వంటి నినాదాలు చేశారు. అనంతరం బ్యాట్‌తో పగలగొట్టిన టీవీలను కింద పారేసి తొక్కారు. అనంతరం దూబే మాట్లాడుతూ.. ఆట ప్రసారాన్ని నిలిపివేడానికి ఇదో సందేశమన్నారు. తాము ఈ మ్యాచ్‌ను చూడాలనుకోవడం లేదని చెప్పారు. ఈ మ్యాచ్ ప్రసారాన్ని నిషేధించాలని కోరుతున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ ఒక ఉగ్రవాద దేశమని.. దానిని అన్నింటిలో బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని బీసీసీఐ, ఐసీసీ గ్రహించేలా తాము ఈ సందేశాన్ని పంపుతున్నామన్నారు.