IND vs AUS 3rd Test: ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే ఆటతీరును కనబరిచింది. 163 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయింది. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కష్టకాలంలో హాఫ్ సెంచరీ సాధించాడు.తన బ్యాటింగ్ సామర్థ్యంతో చాలాసేపు నిలబడి 59 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో పుజారా అర్థశతకంతో మెరిశాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒక ఎండ్‌లో నిలబడి టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 45.1 ఓవర్లో 108 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. అనంతరం 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు.
పుజారా టెస్టు కెరీర్‌లో ఇది 35వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. పిచ్‌పై బంతి అనూహ్యంగా టర్న్ అవుతుండడంతో ఎలా బ్యాటింగ్ చేయాలో అర్థం కాక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పుజారా మాత్రం తన విలువేంటో చూపిస్తూ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా ఎదురీదుతోంది. టీమిండియా 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్ అయింది. 163 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా.. 75పరుగుల లీడ్‌లో మాత్రమే ఉంది. 75 పరుగులు సాధించడం ఆసీస్‌కు అంత కష్టమేమీ కాదు. ఆసీస్‌దే విజయని ఇప్పటికే తెలుస్తోంది. ఇదిలా ఉండగా రేపే మ్యాచ్ రిజల్ట్ తేలనున్నట్లు క్రీడానిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Global Investors Summit: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. ఘనంగా ఏర్పాట్లు
ఇదిలా ఉండగా.. తొలి గంట నుంచే బంతి గింగిరాలు తిరిగిన ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగుస్తుందనే అంచనాలు కలుగుతున్నాయి. ఇలా టెస్టులు మూడు రోజుల్లోనే ముగిస్తే ఆటకు మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే పిచ్ తయారీకి సరిపడా సమయం లేకపోవడం వల్లే ఇండోర్‌లో ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ అన్నాడు. ఈ టెస్టును ధర్మశాల నుంచి ఇండోర్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఆట తొలి గంటలోనే కునెమన్ బౌలింగ్‌లో రోహిత్ స్టంపౌటైన బంతి 8.3 డిగ్రీలు, లైయన్ బౌలింగ్‌లో పుజారా బౌల్డయిన బంతి 6.8 డిగ్రీలు తిరిగింది.