Global Investors Summit: విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ఏపీ సర్కారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వచ్చే అతిథులను ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లు చేసింది. పారిశ్రామిక వేత్తల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు పరిశ్రమలు సిద్ధమవుతున్నాయి. సీఎం జగన్ సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‍కి 35 మంది టాప్ పారిశ్రామిక వేత్తలు, 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్‌లు తరలిరానున్నారు.
రెండు రోజుల సమ్మిట్ కోసం ఇప్పటికే 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే స్పందన ఏ స్ధాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. దీంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన వసతి, రవాణా సౌకర్యాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమ్మిట్‌లో పాల్గొవడానికి అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు 16 ప్రత్యేక విమానాల్లో విశాఖ వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు వస్తున్నారు.ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని విశాఖ సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. 2,500 మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రధాన వేదిక ప్రాంగణం అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని సీపీ తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వీఐపీలు బస చేసే హోటల్స్, ప్రయాణించే మార్గాలు అన్నీ పూర్తి స్థాయి భద్రతలో ఉంటాయన్నారు.
Read Also: Tripura: బీజేపీని సవాల్ చేసిన త్రిపా మోథా.. ఆ ఒక్కటి తప్పా అన్నింటికి సిద్ధమన్న కాషాయపార్టీ..
కేంద్ర మంత్రులను ఎయిర్‌పోర్ట్ నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. పారిశ్రామిక దిగ్గజాలను దృష్టిలో పెట్టుకుని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. మొత్తంగా దాదాపు 800 మందికి పైగా వీఐపీలు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 800 వాహనాలను విశాఖ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు.