2025 ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకోవాలనే పాకిస్తాన్ ఆశలు పూర్తిగా అడియాసలయ్యాయి. మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా చేతిలో 150 పరుగుల తేడాతో ఓడిపోయింది. వర్ష ప్రభావితమైన ఈ మ్యాచ్‌లో పాక్ 20 ఓవర్లలో 234 పరుగులు చేయాల్సి ఉండగా.. ఏడు వికెట్లకు 83 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 312 పరుగులు చేసింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్నాయి . పాకిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్స్ సెమీఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. నాల్గవ స్థానం కోసం ఇప్పుడు భారత్, న్యూజిలాండ్, శ్రీలంకలు పోటీ పడుతున్నాయి. మూడింటిలో భారత్‌కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. భారత్ 5 మ్యాచ్‌లు ఆడి +0.526 రన్ రేట్ కలిగి ఉంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో టీమిండియా మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. రెండు జట్లను ఓడిస్తే 8 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.
ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయి.. బంగ్లాదేశ్‌పై గెలిస్తే మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌ను ఇంగ్లాండ్ ఓడించాల్సి ఉంటుంది. భారత్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోతే.. టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు, -0.245 నెట్ రన్ రేట్‌తో ఐదవ స్థానంలో ఉంది. కివీస్ తన రెండు మ్యాచ్‌లలో (భారత్, ఇంగ్లాండ్) గెలిస్తే 8 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ భారత్‌ను న్యూజిలాండ్ ఓడించి ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతే.. భారత్‌ను బంగ్లాదేశ్ ఓడిస్తే కివీస్ జట్టుకు అవకాశం ఉంటుంది. అప్పుడు శ్రీలంక కంటే మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉండాలి లేదా శ్రీలంకను పాకిస్తాన్ ఓడించాలి.
Also Read: Gold Prices Drop: పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఈ ఆకస్మిక పతనం ఏంటి?, 12 ఏళ్ల రికార్డు బ్రేక్!
శ్రీలంక 6 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. శ్రీలంక నెట్ రన్ రేట్ -1.035. శ్రీలంకకు పాకిస్తాన్‌తో ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. పాకిస్తాన్‌పై విజయం సాధించినా శ్రీలంకకు సెమీస్ అవకాశాలు ఉండవు. భారత్ తన రెండు మ్యాచ్‌లలో ఓడాలి, న్యూజిలాండ్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాలి. అదనంగా నెట్ రన్ రేట్ న్యూజిలాండ్ కంటే ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ జరిగేపని కాదు కాబట్టి లంకకు ఆశలు లేనట్టే. మనకు ప్రధాన పోటీ ఇప్పుడు న్యూజిలాండ్.