వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ అనగానే.. సగటు క్రికెట్ అభిమానికి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలే గుర్తుకొస్తారు. ఈ భారత క్రికెటర్ల నికర విలువ వెయ్యి కోట్లకు పైనే ఉంటుంది. అయితే విరాట్, ధోనీ, సచిన్ కంటే ఎన్నో రెట్లు ధనవంతుడైన భారత క్రికెటర్ కూడా ఉన్నాడు. ఎంతలా అంటే అతను ఓ ఐపీఎల్ జట్టును కూడా సునాయాసంగా కొనుగోలు చేయగలడు. అతడు మీరెవరో కాదు.. 2019లో 22 ఏళ్లకే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆర్యమన్ విక్రమ్ బిర్లా.
వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ల జాబితాలో ఆర్యమన్ బిర్లా అగ్ర స్థానంలో ఉన్నాడు. అతడు రూ.70 వేల కోట్లకు అధిపతి. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఈ ఆర్యమన్. 1997లో జన్మించిన అతడు.. వ్యాపార రంగంతో పాటు క్రికెట్‌లోనూ రాణించాడు. 2019లో 22 ఏళ్ల వయసులో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆర్యమన్.. అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. 2023లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటెయిల్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఎన్నికయ్యాడు. ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు కూడా డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆర్యమన్ బిర్లా నికర ఆస్తి విలువ రూ.70 వేల కోట్లకు పైనే.
Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా వేలంలో ఉంటే.. రూ.520 కోట్లు కూడా సరిపోవు!
ఆర్యమన్ బిర్లా 2017లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మధ్యప్రదేశ్ తరఫున 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 4 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 414 పరుగులు చేసిన అతడు.. లిస్ట్-ఏలో 36 పరుగులే చేశాడు. కెరీర్ మొత్తంలో ఒక శతకం (103 నాటౌట్) బాదాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ఆర్యమన్‌ను 2018లో ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. రెండేళ్లు జట్టుతోనే ఉన్నా.. తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు. 2019లో ఆర్ఆర్ అతడిని వదిలేసింది. గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆర్యమన్.. 2019లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌లో సక్సెస్ కాకపోయినా అతడు ఇప్పుడు బాగా వ్యాపారవేతగా ఉన్నాడు.