ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో భారత్ ఓడిపోయింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో గిల్ సేన 22 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (61 నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అనూహ్యంగా మహమ్మద్ సిరాజ్ బోల్డ్ అవ్వడంతో.. 193 పరుగుల చేధనలో భారత్ 170 పరుగులకు కుప్పకూలింది. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనకపడిపోయింది. ఇక ఇంగ్లండ్, భారత్ మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్‌లో జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
అందరికంటే ముందు బ్యాటర్ కరుణ్ నాయర్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ‘డియర్ క్రికెట్.. ఒక్క ఛాన్స్’ అంటూ సోషల్ మీడియాలో వేడుకున్న నాయర్.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. 0, 20, 31, 26, 40, 14 పరుగులతో నిరాశపర్చాడు. రెండుసార్లు 30 ప్లస్ రన్స్ చేసినా.. వాటిని భారీ స్కోర్లుగా మల్చడంలో విఫలమయ్యాడు. నాలుగో టెస్ట్ నుంచి నాయర్‌ను తప్పించి.. ఐపీఎల్ స్టార్ సాయి సుదర్శన్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. టెస్ట్ స్పెషలిస్ట్ అభిమన్యు ఈశ్వరన్ ఆడే ఛాన్స్ కూడా లేకపోలేదు. మాంచెస్టర్ టెస్ట్ కీలకం కాబట్టి.. నాయర్‌పై కచ్చితంగా వేటు పడనుంది.
మూడో టెస్టులో కీపింగ్ చేస్తూ గాయపడిన రిషభ్ పంత్ నాలుగో టెస్ట్ ఆడటం అనుమానమే. గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. పంత్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. నాలుగో టెస్ట్‌కు ఇంకా వారం సమయం ఉంది కాబట్టి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే.. ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి వస్తాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజాలు బ్యాటింగ్ భారం మోయనున్నారు.
Also Read: Lord’s Test: సుందర్‌ని స్లెడ్జ్ చేసిన ఇంగ్లండ్ పోకిరి.. మైండ్ గేమ్ బాగానే వర్కౌట్ అయింది!
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చే అవకాశం ఉంది. నాలుగో టెస్టులో బుమ్రాకు రెస్ట్ ఇచ్చి.. చివరి మ్యాచ్ ఆడించే అవకాశం ఉంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నాడు. మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ తుది జట్టులో ఉంటారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మంచి ప్రదర్శన చేయడంతో జట్టులో కొనసాగుతాడు. నాలుగో టెస్టులో అర్ష్‌దీప్ సింగ్, సాయి సుదర్శన్ ఆడే అవకాశాలు ఉన్నాయి.