Site icon NTV Telugu

India Pak War : భయానక సైరన్.. జైసల్మేర్‌ను టార్గెట్‌గా చేసుకున్న పాక్ దాడులు.. తిప్పికొడుతున్న భారత్‌

Pak Shelling

Pak Shelling

India Pak War : పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ తన దుశ్చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. శనివారం ఉదయం నుంచే జైసల్మేర్ వ్యాప్తంగా పోలీసులు, ఆర్మీ అప్రమత్తమయ్యారు. నగరమంతా ఖాళీ చేయిస్తున్నారు. భయానక సైరన్‌ల మోతతో జైసల్మేర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జైసల్మేర్‌కు కేవలం 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గిడా గ్రామంలో పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్స్‌ను భారత ఆర్మీ సమర్థవంతంగా కూల్చివేసింది. అయితే ముప్పు ఇంకా పొంచి ఉందన్న హెచ్చరికలతో ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు కఠినంగా ఆదేశించారు. జైసల్మేర్‌లోని ప్రధాన రహదారులన్నీ భద్రతా దళాల ఆధీనంలోకి వెళ్లాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో జైసల్మేర్‌లోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. భయంతో ప్రజలు ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

OperationSindhoor: జైశంకర్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి రుబియో ఫోన్‌..

ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ఆర్మీ మరోవైపు పూంచ్‌పై మరోసారి విరుచుకుపడుతోంది. వరుస దాడులతో సరిహద్దు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. జైసల్మేర్‌ను లక్ష్యంగా చేసుకోవడం పాకిస్తాన్ దురుద్దేశాన్ని మరోసారి బయటపెడుతోంది. పౌర ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుని భయాందోళనలు సృష్టించాలని చూస్తోంది. భారత ఆర్మీ మాత్రం పూర్తి అప్రమత్తతతో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలకు ధైర్యం చెబుతూ, త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని భరోసా ఇస్తున్నారు. అయితే అప్పటివరకు ప్రజలు అధికారుల ఆదేశాలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖాళీ అవుతున్న జైసల్మేర్ ప్రధాన రహదారులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తదుపరి ఏం జరుగుతుందోనని ప్రజలు భయంభయంగా ఎదురుచూస్తున్నారు.

Bangladesh: బంగ్లాదేశ్‌కు షాక్‌.. కేంద్రం కీలక నిర్ణయం..!

Exit mobile version