NTV Telugu Site icon

IND vs SA: మార్‌క్రమ్‌ అద్భుతం.. కొన్నిసార్లు బౌలర్లపై ఎటాక్‌ చేయడమే సరైన నిర్ణయం: సచిన్

Teamindia Test

Teamindia Test

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతేకాదు కేప్‌టౌన్‌లో తొలి టెస్టు విజయాన్ని భారత్ నమోదు చేసింది. భారత్‌ విజయంలో పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ 6 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్స్ పడగొట్టాడు. మొత్తంగా రెండో టెస్టులో సిరాజ్‌ 7 వికెట్లు, బుమ్రా 8 వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికాపై సిరీస్‌ను సమం చేసిన భారత ఆటగాళ్లను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభినందించాడు.

‘దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను సమం చేసిన టీమిండియాకు శుభాకాంక్షలు. ఐడెన్ మార్‌క్రమ్‌ ఆడిన విధానం అద్భుతం. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాంటి పిచ్‌పై డిఫెన్స్ ఆడడం కంటే.. బౌలర్లపై ఎటాక్‌ చేయడమే సరైన నిర్ణయం. మార్‌క్రమ్‌ అదే చేశాడు. జస్ప్రీత్ బుమ్రా అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. ఇటువంటి పిచ్‌పై ఎలా బౌలింగ్‌ చేయాలన్నది బుమ్రా చూపించాడు’ అని సచిన్‌ టెండూల్కర్‌ ఎక్స్‌లో పేర్కొన్నాడు. భారత జట్టు గెలుపుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Also Read: ICC Awards 2023: ఐసీసీ వన్డే అవార్డు.. నలుగురిలో భారత్ నుంచి ముగ్గురు పోటీ!

దక్షిణాఫ్రికా పర్యటనను భారత్‌ ద్విగ్విజయంగా ముగించింది. మూడు (టీ20, వన్డే, టెస్ట్) సిరీసుల్లో ఒక్కదానిని కూడా కోల్పోకుండా స్వదేశానికి పయనం అయింది. వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకోగా.. టీ20 సిరీస్‌, టెస్టు సిరీస్‌లు సమం అయ్యాయి. కేప్‌టౌన్‌లో ఏడు టెస్టులు ఆడిన భారత్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.