Ravindra Jadeja Says I am Not a best fielder in the world: వన్డే ప్రపంచకప్ 2011లో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నిర్వర్తించిన బాధ్యతలను 2023 ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజా నిర్వర్తిస్తున్నాడు. జట్టుకు అవసరం అయినపుడు రన్స్ చేస్తూ, వికెట్స్ తీస్తూ సరైన ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నాడు. ఇక ఫీల్డింగ్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫీల్డింగ్ విన్యాసాలతో పరుగులను అడ్డుకోవడమే కాకుండా.. కళ్లు చెదిరే క్యాచులు పడుతూ బ్యాటర్‌లను పెవిలియన్ చేర్చుతున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాపై ఏకంగా 5 వికెట్స్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో 110 పరుగులు, 14 వికెట్లు తీశాడు.
మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రవీంద్ర జడేజా మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ‘మొదటి నుంచి కూడా నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా. జట్టులో ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటనేది తెలుసు. జట్టుకు అవసరమైనప్పుడు పరుగులు (30-35) చేయడం, వికెట్ తీయడం నా బాధ్యత. మ్యాచ్‌లో నా ప్రభావం చూపించడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తా. ఫీల్డింగ్‌లో నేనే గొప్ప అని మాత్రం భావించను. నేడు క్యాచ్‌లను మిస్ చేశా. అయితే ఎప్పుడూ సాధన చేస్తూనే ఉంటా. ఓ క్యాచ్ పట్టగానే రిలాక్స్ కాను. ఇంకా మెరుగ్గా ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నిస్తా. కొన్నిసార్లు క్యాచ్‌లను అందుకోలేకపోవచ్చు. అయితే ప్రయత్నించడం మాత్రం ఆపను’ అని జడేజా తెలిపాడు.
Also Read: Virat Kohli-Rohit Sharma: విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు.. అతడు మాకు ఎంతో అవసరం: రోహిత్
‘ఈ మ్యాచ్‌లో (దక్షిణాఫ్రికా) మా ఫాస్ట్ బౌలర్లు ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు తీయడంతో బ్యాటర్లపై బాగా ఒత్తిడి పెరిగింది. నేను లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేశా. వికెట్స్ దక్కాయి. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడం సంతోషంగా ఉంది. నా ఆటపై నాకు నమ్మకం ఉంటుంది. పేసర్లు ఆరంభంలోనే వికెట్లను తీస్తే.. స్పిన్నర్ల పని మరింత సులువవుతుంది. అదే ఇక్కడ జరిగింది. సెమీస్ మ్యాచ్‌లో ఇదే ఆట తీరును ప్రదర్శిస్తాం’ అని రవీంద్ర జడేజా ధీమా వ్యక్తం చేశాడు. జడేజా 5 వికెట్స్ పడగొట్టడంతో పటిష్ట దక్షిణాఫ్రికా 83 పరుగులకే ఆలౌట్ అయింది.