Site icon NTV Telugu

IND vs PAK: పనికిమాలిన ప్లేయర్స్, డబ్బులు బొక్క.. ఇకపై మ్యాచ్ మేం చూడం!

Pakistan Fans

Pakistan Fans

భారత్, పాకిస్థాన్‌ క్రికెట్ మ్యాచ్‌ అంటే.. హోరాహోరీ పోరు, ఆటగాళ్లలో కసి, అభిమానుల్లో ఎంతో ఆసక్తి, పతాక స్థాయిలో భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆసియా కప్‌ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన భారత్‌, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఇవేమీ కనిపించలేదు. దుబాయ్ స్టేడియంలో పాక్ అభిమానుల సందడి కాసేపు కనిపించినా.. ఆ తర్వాత అది కూడా కనిపించకుండా పోయింది. పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కారణంగా ఫాన్స్ నిరాశలో కనిపించారు. భారత్ చేతిలో ఓటమి అనంతరం మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానుల మనస్సులు ముక్కలయ్యాయి.

దుబాయ్‌లో మ్యాచ్ చూడటానికి వచ్చిన పిల్లల నుంచి పెద్దవారి వరకు పాకిస్థాన్‌ అభిమానులు తమ జట్టుపై తీవ్ర విమర్శలు చేశారు. స్టేడియం వెలుపల పాక్ అభిమానులు ఏఎన్‌ఐతో మాట్లాడారు. ఒక అభిమాని మాట్లాడుతూ… ‘పనికిమాలిన ప్లేయర్స్ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పస కనిపించలేదు. మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందని అనుకున్నాము కానీ.. అదీ లేదు’ అని అన్నాడు. ‘నేను చాలా డబ్బు ఖర్చు చేసి అబుదాబి నుండి వచ్చాను. తీరా చూస్తే ఎంజాయ్ మెంట్ లేదు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏకపక్షంగా సాగింది. మ్యాచ్ నిలిచిపోయి ఉంటే బాగుండేది అనుకున్నా. భారత్ బాగా ఆడింది’ అని మరొక ఫాన్స్ చెప్పాడు.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. దిగొచ్చిన బంగారం ధరలు!

‘సెప్టెంబర్ 21న సూపర్ ఫోర్‌లో భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్ ఉండొచ్చు. ఆ మ్యాచ్‌కు నేను రాను. వస్తే డబ్బులు బొక్క’ అని మరో పాకిస్థాన్‌ అభిమాని నిరాశగా చెప్పాడు. ‘మా ప్లేయర్స్ చాలా చెత్త ఆట ఆడారు. మ్యాచ్ మధ్యలోనే డిన్నర్ ఎక్కడ చేద్దామని ఆలోచించాను. ఇకపై మ్యాచ్ మేం చూడం’ అని ఓ పిల్లడు చెప్పుకొచ్చాడు. ‘పాకిస్థాన్‌ చెత్తగా ఆడింది’ అంటూ మరో అభిమాని నిరుత్సాహంగా చెప్పాడు. అయితే కొందరు ఫాన్స్ మాత్రం జట్టుకు అండగా నిలబడ్డారు. ‘ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారు. భారత జట్టు పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉంది’ అని ఓ ఫ్యాన్ మద్దుతు ఇచ్చాడు.

Exit mobile version