BCCI clears air on India to don orange jersey for showdown clash with Pakistan: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత్ సరికొత్త జెర్సీతో బరిలోకి దిగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా బీసీసీఐ స్పందించింది. సోషల్ మీడియా కథనాలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారత జట్టు బ్లూ జెర్సీతో మ్యాచ్‌లను ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రాక్టీస్ సందర్భంగా డచ్ ఆరెంజ్ రంగులోని జెర్సీని ఆటగాళ్లు ధరిస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఇదే జెర్సీతో భారత్ బరిలోకి దిగుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు కాస్త బీసీసీఐ వరకు చేరాయి. తాజాగా వాటిపై బీసీసీఐ అధికారికంగా స్పందించింది. అవన్నీ రూమర్లేనని బీసీసీఐ కొట్టిపారేసింది.
‘వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగిన భారత్ జట్టు ఒక మ్యాచ్ కోసం మరో కిట్‌ను ధరించదు. సోషల్ మీడియా కథనాలను మేం ఖండిస్తున్నాం. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఊహాగానాలతో పోస్టులు చేయడం సరైంది కాదు. ‘మెన్ ఇన్ బ్లూ’ భారత క్రీడా రంగానికి సంబంధించిన రంగు. ఐసీసీ ప్రపంచకప్‌లోనూ ఇదే జెర్సీతో ఆడతాం’ అని బీసీసీఐ పేర్కొంది. ఐసీసీ ప్రపంచకప్ 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ప్రత్యామ్నాయ జెర్సీతో ఆడింది. అప్పుడు ఇరు జట్ల జెర్సీలు బ్లూ కలర్‌లోనే ఉండేవి. దీంతో భారత్ బ్లూ డార్క్ షేడ్ షర్ట్‌కు ఆరెంజ్ స్లీవ్‌తో కూడిన జెర్సీతో ఆడింది.