ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడనున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఫైనల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరు కానున్నాడు. ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఆసియా కప్ 2025 ఫైనల్‌కు రానున్నాడు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ పట్ల ఆయన తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. విజేతకు తన చేతుల మీదుగా ట్రోఫీ అందిస్తా అని చెప్పాడు.
‘ఈ సంవత్సరం క్రికెట్ నైపుణ్యం, ప్రతిభకు అద్భుతమైన ప్రదర్శనగా ఆసియా కప్ నిలిచింది. అభిమానుల అభిరుచి, ఆసియా జట్ల పోటీ స్ఫూర్తి, మైదానంలో అద్భుతమైన ప్రదర్శనలు చిరస్మరణీయంగా మార్చాయి. ఆసియా ఖండం అంతటా క్రికెట్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శననే రికార్డు స్థాయి వ్యూస్. ఫైనల్‌ను చూడటానికి నేను ఉత్సాహంగా ఉన్నాను. గెలిచిన జట్టుకు ట్రోఫీని అందించడానికి ఎదురు చూస్తున్నాను’ అని మోహ్సిన్ నఖ్వీ ఒక ప్రకటనలో తెలిపాడు. మ్యాచ్ తర్వాత జరిగే ట్రోఫీ వేడుకలో మోహ్సిన్ నఖ్వీ హాజరు కావడం పట్ల బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్.. అభిషేక్ శర్మ సెంచరీ పక్కా!
బోర్డు అధిపతులు క్రికెట్ మ్యాచ్‌కు హాజరుకావడం సర్వసాధారణమే. ఏసీసీ చీఫ్‌గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ఫైనల్ తర్వాత విజేతకు ట్రోఫీ అందిస్తాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధిపతిగా ఆయనకు ట్రోఫీని ప్రదానం చేయడానికి, సాంప్రదాయకంగా రెండు జట్లతో కరచాలనం చేయడానికి పూర్తి అధికారం ఉంటుంది. పాకిస్తాన్‌తో ‘నో హ్యాండ్‌షేక్’ విధానాన్ని అనుసరిస్తున్న బీసీసీఐ.. భారత ఆటగాళ్లకు మొహ్సిన్ నఖ్వీతో మాట్లాడటానికి అనుమతించే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ భారత్ విజేతగా నిలిస్తే.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు బీసీసీఐ ఒప్పుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చూడాలి మరి పీసీబీ చీఫ్ అత్యుత్సాహంపై బీసీసీఐ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఆసియా కప్ చరిత్రలో పాకిస్తాన్, భారత్ టీమ్స్ ఫైనల్‌లో తలపడటం ఇదే మొదటిసారి.
