Ravichandran Ashwin Take 4 wickets in England 2nd Innings: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెచ్చిపోయాడు. తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఇప్పటికే యాష్ నాలుగు వికెట్స్ పడగొట్టి ఇంగ్లీష్ నడ్డి విడిచాడు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీయడంతో మూడో రోజు భోజన విరామం సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్స్ కోల్పోయి 103 రన్స్ చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 156 పరుగులు వెనకపడి ఉంది. భరత్ స్పిన్నర్ల జోరు చూస్తే మ్యాచ్ ఈ రోజే ముగిసేలా కనబడుతోంది.
మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోర్ 473/8తో మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్ వికెట్ కోల్పోయింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (30) ఔటయ్యాడు. కాసేపటికే జస్ప్రీత్ బుమ్రా (20)ను షోయబ్ బషీర్ పెవిలియన్ చేర్చాడు. భారత బ్యాటర్లలో గిల్ (110), రోహిత్ (103)లు సెంచరీలు చేయగా.. పడిక్క్ (65), జైస్వాల్ (57), సర్ఫరాజ్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 259 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
Also Read: IND vs ENG Test: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జేమ్స్ ఆండర్సన్!
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లో ఓపెనర్ బెన్ డకెట్ (2)ను ఆర్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 6వ ఓవర్లో మరో ఓపెనర్ జాక్ క్రాలే (0)ను యాష్ పెవిలియన్ చేర్చాడు. 11వ ఓవర్లో ఒలీ పోప్ (19)ను కూడా ఔట్ చేసి భారీ షాక్ ఇచ్చాడు. వికెట్స్ పడుతున్నా బెయిర్‌స్టో, రూట్‌లు దూకుడుగా ఆడారు. అయితే వీరి దూకుడుకు కుల్దీప్ యాదవ్ కళ్లెం వేశాడు. 18వ ఓవర్లో బెయిర్‌స్టో (39)ను వికెట్ల ముందు దోరకబుచ్చుకున్నాడు. 23వ ఓవర్లో బెన్ స్టోక్స్ (2)ను యాష్ క్లీన్ బౌల్డ్ చేశాడు.