James Anderson breaches the 700 Test wickets: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదవ టెస్టులో జిమ్మీ ఈ ఫీట్ సాదించాడు. ఆట మూడవ రోజు ఉదయం నాల్గవ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేసిన ఆండర్సన్.. 700 టెస్ట్ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా టెస్ట్ క్రికెట్‌లో 700 వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా జిమ్మీ రికార్డుల్లో ఉన్నాడు.
41 ఏళ్ల వయసులో జేమ్స్ ఆండర్సన్ 700 వికెట్ ఘనత సాధించడం విశేషం. టెస్ట్ క్రికెట్‌లో మరే పేసర్ కూడా 700 వికెట్లు పడగొట్టలేదు. ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 604 వికెట్స్ తీసి రెండో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) స్పిన్నర్లు కావడం విశేషం. 2003లో లార్డ్స్‌లో జింబాబ్వేతో జరిగిన టెస్టుతో జిమ్మీ తన కెరీర్ ఆరంభించాడు. 21 సంవత్సరాల కెరీర్‌లో అతడు 187వ టెస్ట్ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. ఏ బౌలర్ కూడా ఇన్ని టెస్టులు ఆడలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200) మాత్రమే జిమ్మీ కంటే ఎక్కువ టెస్టులు ఆడాడు.
Also Read: Road Accident: ఖమ్మంలో బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు! కొండగట్టులో 11 మందికి గాయాలు
ధర్మశాల టెస్ట్‌కు ముందు జేమ్స్ ఆండర్సన్ 698 వికెట్స్ పడగొట్టాడు. రెండవ రోజు లంచ్ తర్వాత శుభమాన్ గిల్‌ను బౌల్డ్ చేసి 699 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. మూడోరోజు ఉదయం కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేసిన 700 టెస్ట్ వికెట్ సాధించాడు. జింబాబ్వే ఆటగాడు మార్క్ వెర్ములెన్ తొలి టెస్టు వికెట్‌గా ఉన్నాడు. జాక్వెస్ కలిస్ (100), పీటర్ సిడిల్ (200), పీటర్ ఫుల్టన్ (300), మార్టిన్ గప్టిల్ (400), క్రైగ్ బ్రాత్‌వైట్ (500), అజర్ అలీ (600) వికెట్‌గా ఉన్నారు.