Kevin Pietersen’s Bold Challenge to Fans on Bowling: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 20-25 సంవత్సరాల క్రితంతో పోలిస్తే.. ఇప్పుడు బ్యాటింగ్ చాలా తేలికగా మారిందన్నాడు. ప్రస్తుత రోజులతో పోలిస్తే.. అప్పట్లో దాదాపు రెండు రెట్లు బ్యాటింగ్ కష్టంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఆ కాలంలో వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ వంటి దిగ్గజ బౌలర్లు ఉండేవారని.. వారిని ఎదుర్కోవడం పెను సవాలుగా ఉండేదన్నాడు. ఇప్పుడు టెస్టు ఆడే దేశాల్లో బౌలింగ్ నాణ్యత పడిపోయిందని కేపీ చెప్పుకొచ్చాడు.
‘నాపై కోపం తెచ్చుకోకండి. నేటితో పోలిస్తే 20–25 సంవత్సరాల క్రితం బ్యాటింగ్ చాలా కష్టం. ఆ సమయంలో వకార్, షోయబ్, అక్రమ్, మెక్‌గ్రాత్, వార్న్, లీ, గిలెస్పీ, వాస్, మురళీ, ముస్తాక్, పొలాక్, ఆంబ్రోస్, వాల్ష్, కుంబ్లే, శ్రీనాథ్, హర్భజన్, డొనాల్డ్, క్లుసెనర్, గాఫ్, బాండ్, వెటోరి, కెయిన్స్.. వంటి దిగ్గజ బౌలర్లు ఉన్నారు. నేను 22 మంది పేర్లను చెప్పాను. నేటి తరంలో వారితో పోటీ పడగల ఓ 10 మంది బౌలర్ల పేర్లు చెప్పండి?’ అని కెవిన్ పీటర్సన్ తన ఎక్స్‌లో పేర్కొన్నాడు. కేపీ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. కొందరు పీటర్సన్ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తుంటే.. మరికొందరు మండిపడుతున్నారు.
Also Read: Jasprit Bumrah: కోహ్లీ, రోహిత్, అశ్విన్.. నెక్స్ట్ రిటైర్మెంట్ జస్ప్రీత్ బుమ్రానే?
ఇంగ్లండ్ దూకుడు బ్యాటింగ్ శైలి ‘బజ్ బాల్’ గురించి కూడా కెవిన్ పీటర్సన్ ప్రస్తావించాడు. బజ్ బాల్‌కు కారణం బ్యాట్స్‌మెన్ త్వరగా పరుగులు చేయడమే. నేటి పిచ్‌లు కూడా బ్యాట్స్‌మెన్‌కు పూర్తి అనుకూలంగా ఉన్నాయని, బౌలర్లు మునుపటిలాగా రాణించడం లేదని కేపీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరిన నేపథ్యంలో కేపీ ఈ వ్యాఖ్యలు చేశాడు. పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున 104 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో గిల్ సేన 1-2 తేడాతో వెనుకబడి ఉంది. మాంచెస్టర్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 రన్స్ చేయగా.. ఇంగ్లీష్ జట్టు 669 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174/2తో ఉంది.