Ben Stokes Counter to Steve Harmison: వచ్చే ఏడాది జనవరి 25 నుంచి భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. అయితే భారత గడ్డపై జరగనున్న ఈ టెస్ట్ సిరీస్ కోసం కేవలం మూడు రోజుల ముందే ఇంగ్లీష్ జట్టు రానుంది. ఈ విషయంపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సరైన సన్నద్ధత లేకపోతే సిరీస్ 5-0తో వైట్‌వాష్ అయిపోవడం ఖాయమని హెచ్చరించాడు. మూడు రోజుల ముందే భారత్‌కు వెళ్లడం తనకు నచ్చలేదని, ఇలా యాషెస్ సిరీస్‌కు చేయరు కదా? అని ప్రశ్నించాడు. హార్మిసన్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ దీటుగా స్పందించాడు.
స్టీవ్ హార్మిసన్ టాక్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ… ‘టెస్టు సిరీస్ ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందే ఇంగ్లండ్ జట్టు భారత్‌కు వెళుతోంది. ఇది సిరీస్‌ను 5-0 తేడాతో కోల్పోవడానికే అని నాకు అనిపిస్తోంది. ఇదే మాట నాలాంటి సీనియర్ అయితే.. కాలం మారింది, ఆట మారింది అని చెబుతారు. కానీ సన్నద్ధత మాత్రం మారలేదని నేను అంటున్నా. భారత్‌కు సరైన సన్నద్ధత లేకుండా వెళ్ళకూడదు. అలా అని అతిగా ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో దాదాపు ఆరు వారాల పాటు ఉండాలి. ఇంగ్లండ్ తొలి టెస్టు కోసం ఇంకా సిద్ధం కాలేదనిపిస్తోంది’ అని అన్నాడు.
Also Read: Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు!
‘కెవిన్ పీటర్సెన్, ఆండ్రూ స్ట్రాస్, అలెస్టర్ కుక్ 2012లో అక్కడ గెలిచారు. భారత్ పిచ్‌లపై ఇంగ్లండ్ విజయం సాధించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇంగ్లండ్ అనుసరిస్తున్న వైఖరి బాగుంది. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్‌కల్లమ్ జట్టులో దూకుడు తెచ్చారు. అయితే కేవలం మూడు రోజుల ముందే భారత్‌కు వెళ్లడం మాత్రం సరికాదు. ఇలా యాషెస్ సిరీస్‌కు చేయలేరు కదా?’ అని స్టీవ్ హార్మిసన్ ప్రశ్నించాడు. ‘భారత్‌తో కఠినమైన సిరీస్‌కు ముందు మేం అబుదాబి వెళ్తున్నాం. అక్కడ ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది. అది మాకు సరిపోదా?’ అని బెన్ స్టోక్స్ బదులిచ్చాడు.