100 Test Match For Ravichandran Ashwin and Jonny Bairstow: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల ఆఖరిదైన టెస్టు మ్యాచ్ ధర్మశాలలో మార్చి 7 నుంచి ఆరంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్.. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తోంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లీష్ జట్టు మంచి గెలుపుతో స్వదేశానికి వెళ్లాలని భావిస్తోంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోలకు ప్రత్యేకంగా నిలవనుంది. ఈ ఇద్దరికీ ఇది కెరీర్‌లో వందో టెస్టు.
ఇటీవలే టెస్టుల్లో 500 వికెట్ల ఘనత అందుకున్న ఆర్ అశ్విన్.. కెరీర్‌లో 100వ టెస్టు ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. 2011లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన అశ్విన్.. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఒంటిచేత్తో భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో జట్టుకు అండగా ఉంటున్నాడు. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడి.. 507 వికెట్స్ పడగొట్టాడు. మరోవైపు 3309 రన్స్ కూడా చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండడం విశేషం. మరోవైపు జానీ బెయిర్‌స్టో 99 టెస్టులో 5974 రన్స్ చేశాడు. కెరీర్‌లో 100వ టెస్ట్ ఆడేందుకు సిద్దమయ్యాడు.
Also Read: T20 World Cup 2024: అభిమానులకు శుభవార్త.. టీ20 ప్రపంచకప్‌ను ఫ్రీగా చూడొచ్చు!
ఈ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో ఆర్ అశ్విన్‌ది కీలకపాత్ర అని చెప్పాలి. 4 టెస్టుల్లో 17 వికెట్లు తీసిన యాష్.. బ్యాటింగ్‌లోనూ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రాంచీలో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మూడో టెస్టు మధ్యలో వ్యక్తిగత కారణంతో జట్టును వీడిన అశ్విన్.. వెంటనే తిరిగి వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన యాష్.. ఆఖరి టెస్టులోనూ తన మార్కు చూపించాలని చూస్తున్నాడు. ఈ సిరీస్‌లో జానీ బెయిర్‌స్టో ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో తడి అత్యధిక స్కోరు 38 మాత్రమే. 100వ టెస్టులో అయినా సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో వందో టెస్టులో మెరిసేదెవరో చూడాలి.