India playing XI vs England in Lord’s Test: మరికొద్దిసేపట్లో లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. రెండో మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియాకు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో మాత్రం పెను సవాల్ తప్పదు. రెండో టెస్టులో ఓడిన ఇంగ్లండ్ పుంజుకునేందుకు అన్ని అస్రాలు సిద్ధం చేసుకుంది. భారత్ కూడా ఒకటి, రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు టెస్టుల్లో అంతగా ప్రభావం చూపించని బ్యాటర్ కరుణ్ నాయర్‌పై వేటు పడే అవకాశం ఉంది. ఈ విషయంపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు.
కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకోవాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. మూడో స్థానంలో నాయర్ అంతగా ప్రభావం చూపించడం లేదని, సాయి సరిగ్గా సరిపోతాడన్నాడు. ‘రెండో టెస్ట్ మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికరమైన సెలెక్షన్లు జరిగాయి. అందులో నేను కొన్నింటిని అంగీకరించలేదు. అయితే భారత్ అద్భుత విజయం సాధించడంతో.. అవేమీ తెరపైకి రాలేదు. మ్యాచ్ ఓడి ఉంటే.. ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడేవారు. ఏదేమైనా సాయి సుదర్శన్‌ను ఒక్క మ్యాచ్‌కే పక్కన పెట్టడం సరికాదు. కుర్రాళ్లకు కొన్ని అవకాశాలు ఇవ్వాలి’ అని మంజ్రేకర్ అన్నాడు.
‘తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ ఫర్వాలేదనిపించాడు. 30కి పైగా రన్స్ చేశాడు. రెండో టెస్టులో అతడు ఆడలేదు. లార్డ్స్ టెస్టులో సాయి తప్పకుండా జట్టులో ఉండాలి. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న కరుణ్ నాయర్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఆ స్థానంకు సాయి సరిగ్గా సరిపోతాడు. నాయర్ నెంబర్ 3 ప్లేయర్ కాదని నేను అందుకుంటున్నా. మూడో టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టాలి. జోఫ్రా ఆర్చర్ వచ్చాడు కాబట్టి.. ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్ మరింత దూకుడుగా ఉండనుంది’ అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.