IND vs ENG: విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. రేపటి నుండి 5 రోజుల పాటు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. రెండు రోజులపాటు ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రేపు ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుండి స్టేడియంలోకి వీక్షకులను సిబ్బంది అనుమతించనున్నారు. రోజుకు 2500 మంది విద్యార్థులకు ఉచితంగా ఎంట్రీ ఇవ్వనున్నారు. 5 మ్యాచ్‌ల టెస్ట్ సీరిస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా విశాఖ మ్యాచ్ కీలకంగా మారింది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాకింగ్స్ లో మరింత కిందకు దిగజారడమే ఇందుకు ప్రధాన కారణం. విశాఖ వేదికగా జరిగిన గత రెండు మ్యాచ్‌లలోనూ భారత్ భారీ విజయం సాధించింది.
Read Also: Union Budget: టార్గెట్ లక్షద్వీప్.. నిర్మల కీలక ప్రకటన
విశాఖలో భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. 2016లో ఇంగ్లండ్‌తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా సెంచరీలతో చెలరేగారు. అయితే కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా రానున్న మ్యాచ్‌లో ఆడకపోవడం రోహిత్ సేనకు ఎదురుదెబ్బ లాంటిదే. దీని తర్వాత, 2019లో దక్షిణాఫ్రికాతో భారత్ ఇక్కడ రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ 203 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు ముందు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు తొలి టెస్టులో ఓటమితో నేరుగా 5వ స్థానానికి పడిపోయింది. అయితే తర్వాతి మ్యాచ్‌లో గెలిచిన వెంటనే టీమ్ ఇండియా కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుతుంది. ఇదిలా ఉంటే స్వదేశంలో గత మూడు టెస్టు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.