India Crush Bangladesh in T20 World Cup 2024 Warm-up Match: టీ20 ప్రపంచకప్ 2024కు ముందు శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఓడింది. మహ్మదుల్లా (40 రిటైర్డ్ హర్ట్ ; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. రిషబ్ పంత్ (53 రిటైర్డ్ ఔట్; 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శివమ్ దూబె (14 రన్స్, 2 వికెట్స్) కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (23; 19 బంతుల్లో)తో కలిసి సంజు శాంసన్ ఓపెనింగ్ చేశాడు. ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించిన శాంసన్ (1) నిరాశపర్చాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. రిషబ్ పంత్ వన్‌డౌన్‌లో ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (31; 18 బంతుల్లో 4 ఫోర్లు) రాణించగా.. హార్దిక్ పాండ్యా (40 నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. శివమ్ దూబె (14) పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్, షోరిఫుల్ ఇస్లామ్, మహ్మదుల్లా, తన్వీర్ ఇస్లామ్ తలో వికెట్ తీశారు.
Also Read: Assam Floods: అస్సాంలో వరదల బీభత్సం.. 15కి చేరిన మరణాల సంఖ్య
ఛేదనలో సౌమ్య సర్కార్ (0), నజ్ముల్ హుస్సేన్ శాంటో (0) డకౌటయ్యారు. తాంజిద్ హసన్ (17), లిట్టన్ దాస్ (6) విఫలమయ్యారు. దీంతో బంగ్లా 41 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో షకీబ్ (28; 34 బంతుల్లో 2 ఫోర్లు), మహ్మదుల్లా జట్టును ఆదుకున్నారు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 75 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో బంగ్లా చేతులెత్తేసింది. చివరి ఓవర్‌లో రిషద్ (0), జాకేర్ (0) డకౌటయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, దూబె తలో రెండు వికెట్స్ పడగొట్టారు.నేడు (జూన్ 2) పొట్టి కప్ ప్రారంభం కానుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్ జూన్ 5న కెనడాతో తొలి మ్యాచ్ ఆడుతుంది.