ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నాకౌట్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. మొదటి సెమీస్‌లో టాప్ టీమ్స్ భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో మూడుకు మూడు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేనకు సెమీస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో నాకౌట్‌లో కంగారూలు రెచ్చిపోతారు. అయితే దుబాయ్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం, పిచ్‌కు తగ్గ బలమైన స్పిన్ ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో ఆసీస్ కొంత బలహీన పడ్డట్లు కనిపిస్తున్నా.. తక్కువ అంచనా వేస్తే ప్రమాదమే.
ఓపెనర్ శుభ్‌మన్ మీద సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ సెమీస్‌లో అయినా ఓ మంచి ఇన్నింగ్స్ ఆడతాడేమో అని ఫాన్స్ చూస్తున్నారు. పాక్‌పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ మరో భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. శ్రేయస్ అయ్యర్ చక్కటి ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ప్రమోషన్‌ను అక్షర్ పటేల్ బాగానే ఉపయోగించుకుంటున్నాడు. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. బౌలింగ్‌లో స్పిన్నర్లందరూ ఫామ్‌లో ఉన్నారు. పేసర్ల మీద మరీ ఎక్కువ ఆధారపడట్లేదు. సీనియర్ షమీ ఆసీస్‌పై ఆరంభంలో వికెట్లు తీయాల్సిందే. హార్దిక్ బంతితోనూ పర్వాలేదనిపిస్తున్నాడు. రిషబ్ పంత్‌కు సెమీస్‌లో అవకాశం దక్కుతుందా? అనే చర్చ జరుగుతోంది.
లీగ్ దశలో అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికాలతో ఆస్ట్రేలియా ఆడాల్సిన మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. ఆడిన ఒక్క మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 352 పరుగుల భారీ ఛేదనలో అద్భుత పోరాటంతో గెలిచింది. గాయాల వల్ల కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్, మార్ష్ దూరం కావడంతో కంగారూలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కనోలీ లేదా జేక్ ఫ్రేజర్ తుది జట్టులోకి రావచ్చు. హిట్టర్లు హెడ్, మ్యాక్స్‌వెల్‌లకు తోడు స్మిత్, లబుషేన్, కేరీలతో బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. బౌలింగ్‌లో డ్వార్షుయిస్, జాన్సన్, ఎలీస్ రాణిస్తున్నారు. స్పెసలిస్ట్ స్పిన్నర్ జంపాకు తోడు మ్యాక్స్‌వెల్, హెడ్, లబుషేన్ ఉన్నారు. హెడ్‌ను త్వరగా అవుట్ చేస్తే భారత్ సగం మ్యాచ్ గెలిచినట్లే.
దుబాయ్ పిచ్ మందకొడిగా ఉంటుంది. బంతి బ్యాట్ మీదికి ఏమాత్రం రాదు. ఇక్కడ 260-270 స్కోరుతో కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే దుబాయ్‌లో బ్యాటర్లు ఓపికతో ఆడాలి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్-18లో లైవ్ మ్యాచ్ రానుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, అక్షర్, రాహుల్/పంత్, హార్దిక్, జడేజా, కుల్దీప్/హర్షిత్, షమీ, చక్రవర్తి.
ఆస్ట్రేలియా: హెడ్, జేక్ ఫ్రేజర్/కనోలీ, స్మిత్ (కెప్టెన్), లబుషేన్, ఇంగ్లిస్, కేరీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, జంపా, ఎలీస్, జాన్సన్.