India Lost U19 World Cup Final to Australia: ఇటీవలి కాలంలో జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్ల ఫైనల్స్‌లో భారత్ పరాభవాలను ఎదుర్కొంది. 9 నెలల వ్యవధిలో మూడుసార్లు భారత్ ఓటములకు ఆస్ట్రేలియానే కావడం విశేషం. సీనియర్ స్థాయిలో అయినా, జూనియర్ టోర్నీలో అయినా ఆసీస్‌ను గెలవలేక భారత జట్లు చేతులెత్తేశాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్, అండర్-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ విజయానికి ఆస్ట్రేలియా అడ్డుపడింది.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా దూకుడు ముందు భారత్ పూర్తిగా తేలిపోయింది. రెండు సంవత్సరాలు అద్భుతంగా ఆడిన భారత్.. ఫైనల్లో మాత్రం కనీస పోటీ కూడా ఇవ్వలేదు. సొంతగడ్డపై ఫేవరెట్‌గా అడుగుపెట్టి.. అజేయంగా వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరిన భారత్.. ఆసీస్ గండాన్ని దాటలేకపోయింది. అన్ని విభాగాల్లో విఫలమయిన రోహిత్ సేన ఆసీస్ ఆధిపత్యం ముందు తలొంచింది. తాజాగా అండర్-19 ప్రపంచకప్ 2024లో యువ భారత్ ఒక్క ఓటమి లేకుండా టైటిల్ పోరులో అడుగుపెట్టి.. ఆసీస్ ముందు తేలిపోయింది. దాంతో 9 నెలల వ్యవధిలో భారత్ అభిమానుల గుండె మూడోసారి కోతకు గురైంది. ఆసీస్ గండాన్ని దాటలేమా? అని ఫాన్స్ బాధపడుతున్నారు.
Also Read: Qatar-India: గూఢచర్యం ఆరోపణలు.. 8 మంది భారతీయులను విడుదల చేసిన ఖతార్ ప్రభుత్వం!
బెనోని వేదికగా ఆదివారం జరిగిన అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో టీమిండియాను ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్ (55) గల్ఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్ రాజ్ లింబాని 3 వికెట్స్ పడగొట్టాడు. ఛేదనలో యువ భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఆదర్శ్ సింగ్ (47), మురుగన్ అభిషేక్ (42) మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్ బౌలర్లు మహ్లీ బార్డ్‌మాన్, రాఫ్ మాక్‌మిలన్ తలో మూడు వికెట్స్ పడగొట్టారు.