India vs Australia 1st ODI 2023 Playing 11: సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 22న మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదటి వన్డేలో యువ ఆటగాళ్లు ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేలో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో.. ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు సీనియర్ ఆటగాళ్లను టీమిండియా మేనేజ్‌మెంట్ దూరం పెట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లకు బీసీసీఐ సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్న సెలెక్టర్లు.. వాషింగ్టన్ సుందర్‌ను తొలి రెండు వన్డేలకు ఎంపిక చేసింది. మూడో వన్డేతో సీనియర్ ఆటగాళ్లంతా తిరిగి జట్టులోకి రానున్నారు.
ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఆడనున్నాడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్, ఆరో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతారు. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆర్ అశ్విన్ ఆడతాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ అదనపు పేసర్ అవసరం అనుకుంటే.. మొహ్మద్ షమీ తుది జట్టులోకి వస్తాడు. ప్రధాన పేసర్లుగా మహహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతారు.
భారత తుది జట్టు (అంచనా):
శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్/మొహ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.