బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో.. రేపు ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు.
విశాఖ:
విశాఖలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ కారణంగా సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అనకాపల్లి, అల్లూరి, విశాఖ జిల్లాల్లో విద్యాసంస్థలు తెరవవొద్దని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
ఏలూరు:
ఏలూరులో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు జిల్లాలోని అన్ని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. జిల్లాలో నమోదవుతున్న అధిక వర్షపాతం కారణంగా జిల్లా అధికారులు వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలలో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో.. రేపు కలెక్టర్ కార్యాలయము నందు, జిల్లాలోని అన్ని డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో జరుగు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (PGRS)కార్యక్రమాలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి వెల్లడించారు.
పశ్చిమ గోదావరి:
ఏలూరులో భారీ వర్షం పడుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా.. రేపు జరగాల్సిన మీకోసం కార్యక్రమం రద్దు చేశారు. సెలవును అన్ని పాఠశాలలు తప్పనిసరిగా అమలు చేయాలని, అమలు చేయని పాఠశాలలపై చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
ఇంతకుముందు.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే..