Former Pakistan PM Imran Khan sentenced to 10 years in jail: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ అధికారంలో ఉన్నప్పుడు దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా ఇదే కేసులో పదేళ్ల శిక్ష పడినట్లు ఇమ్రాన్ తరపు న్యాయవాది షోయబ్ షాహీన్ తెలిపారు. స్పెషల్ కోర్టు తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.
సైఫర్ కేసు (ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడం) అనేది దౌత్య పరమైన సమాచారానికి సంబంధించినది. 2023 మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని ఆయనపై కేసు నమోదైంది. అంతకుముందు 2022 ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఇమ్రాన్.. ప్రధాని పదవి నుండి వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2023 ఆగస్టు 5న ఇమ్రాన్ జైలుకు వెళ్లారు.
Also Read: Vizag Test: గిల్‌పై వేటు.. పాటిదార్, సర్ఫరాజ్ ఎంట్రీ!
తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇటీవల ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపివేసింది. ఆ వెంటనే సైఫర్ కేసులో ఇమ్రాన్ అరెస్టయ్యారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయన ఉన్నారు. సైఫర్ కేసులో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.. 2023 సెప్టెంబర్‌లో ఇమ్రాన్, ఖురేషీలపై ఛార్జిషీట్ సమర్పించింది. భద్రతా సమస్యల దృష్ట్యా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జైల్లోనే ఇటీవల విచారణ చేపట్టారు. తాజాగా వారికి 10 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.