Rahul Gandhi: ప్రతిపక్షాలు ఏకమైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అసాధ్యమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రెండు రోజుల పాటు జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ వేదిక 60 శాతం భారత జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తుందని, ఈ వేదికపై ఉన్న పార్టీలు ఏకమైతే బీజేపీ ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని అన్నారు. సాధ్యమైన రీతిలో కలిసి రావాలని కాంగ్రెస్ నాయకుడు ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేశారు.
Also Read: One Nation One Election: దేశంలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ సాధ్యమా?
రెండు రోజుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రెండు పెద్ద అడుగులు వేశామని చెప్పారు. ఇందులో 14 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం, సభ్య పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలను వేగవంతం చేయడం, వీలైనంత త్వరగా వాటిని జరిగేలా చేయడం అనే నిర్ణయాలు జరిగాయన్నారు. ఇండియా కూటమి బీజేపీని ఓడిస్తుందని నమ్మకం ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ కూటమి నేతల మధ్య కుదిరిన సంబంధాలే అసలైన పని అని.. ఈ రెండు సమావేశాలు అందరి మధ్య సాన్నిహిత్యం పెంచడంలో పెద్ద ఎత్తున కృషి చేశాయని విశ్వాసంతో చెప్పగలనన్నారు. నాయకులందరూ ఒక్కటిగా పనిచేసేలా చూస్తామన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్రం ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇండియా కూటమి బీజేపీ, ప్రధాని అవినీతిని బయటపెడుతుందని, దానిని రుజువు కూడా చేస్తుందని రాహుల్ వెల్లడించారు. అదానీ గ్రూప్‌పై తాజా ఆరోపణలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని, ఒక వ్యాపారవేత్త మధ్య అనుబంధం ప్రతి ఒక్కరికి కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం ఇండియా G20 సమ్మిట్‌కి సిద్ధమవుతోందని, ప్రపంచంలోనే భారత్ స్థానం ఏంటో ఇది నిరూపించనుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంతో పారదర్శకంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం వెనుక ఉన్న ఆలోచన ఈ దేశంలోని పేద ప్రజల నుండి డబ్బును సంగ్రహించి, కొద్దిమందికి బదిలీ చేయడమేనని ఆయన ఆరోపించారు. ఈ దేశ ప్రగతిలో పేద ప్రజలు, రైతులు, కార్మికులు మళ్లీ భాగస్వాములు కావాలని రాహుల్ పేర్కొన్నారు.