Wrestling Body Chief Brij Bhushan Sharan Singh: మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బుధవారం నాడు తనపై ఒక్క ఆరోపణ రుజువైనా ఉరివేసుకుంటానని అన్నారు. రెజ్లర్లందరూ తన పిల్లలలాంటి వారని, తన రక్తం, చెమట కూడా వారి విజయానికి కారణమైనందున వారిని నిందించనని ఆయన పేర్కొన్నారు. రాంనగర్ ప్రాంతంలోని మహదేవ ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘నాపై ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానని మరోసారి చెబుతున్నాను.” అని అన్నారు.
‘‘నన్ను ఉరి తీయాలని వారు (మల్లయోధులు) కోరుతూ నాలుగు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నన్ను ఉరి తీయడం లేదు.. అందుకే వారు తమ పతకాలను గంగలో నిమజ్జనం చేసేందుకు వెళ్తున్నారు. బ్రిజ్ భూషణ్‌ను గంగలో పతకాలు విసిరితే ఉరితీయరు. మీ వద్ద రుజువు ఉంటే కోర్టుకు ఇవ్వండి, కోర్టు నన్ను ఉరితీస్తే నేను దానిని అంగీకరిస్తాను. ఆటగాళ్లంతా నా బిడ్డల్లాం టి వారే.. కొద్ది రోజుల క్రితం వరకు నన్ను రెజ్లింగ్ దేవుడు అని పిలిచేవారు.. నేను రెజ్లింగ్ సమాఖ్య చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలోనే భారత్‌కు 20వ ర్యాంక్ వచ్చింది.. ఈరోజు నా కష్టానికి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ రెజ్లింగ్ జట్లలో భారతదేశం పేరు చేర్చబడింది. నేను పగలు, రాత్రి రెజ్లింగ్‌లో జీవించాను. ఏడు ఒలింపిక్ పతకాలలో ఐదు (రెజ్లింగ్‌లో) నా పదవీకాలంలోనే భారత్‌కు వచ్చాయి. నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. ” అని ఆయన అన్నారు.
జూన్ 5న అయోధ్యలో నిర్వహించనున్న “జన్ చేతన మహా ర్యాలీ”కి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ను అరెస్టు చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని సోమవారం రెజ్లర్లు చెప్పడంతో బ్రిజ్ భూషణ్ సింగ్ ప్రకటనలు వెలువడ్డాయి.