AP Weather: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడా చెదురుమొదురు వర్షాలు కురుస్తూ.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
కోస్తా ప్రాంతంలో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల తర్వాత మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు. దయచేసి వ్యవసాయ మరియు ఉపాధి పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండొద్దన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.
Read Also: CS Shanti Kumari : రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉంది.. తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవు
అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది కిందిస్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాలల్లో సముద్రమట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆదే ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.