NTV Telugu Site icon

IIT Madras : ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

Iit Madras

Iit Madras

IIT Madras : సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపి ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఐఐటి మద్రాసు నిర్ణయించింది. ఐఐటిఎం ప్రతినిధులతో ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాలు అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం, పరిశోధన, శిక్షణ, సాంకేతికతలో రాష్ట్రం ముందుకు పోవడానికి దోహదం చేస్తాయి.

1. ఐఐటీ-ఏపీ సీఆర్డీయే ఒప్పందం
అమరావతిలో డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి సాంకేతిక సలహాలను అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వం కలిసి ఫిజికల్ , వర్చువల్ పద్ధతుల్లో ఈ ప్రాజెక్టులో పని చేస్తుంది.

2. ఐఐటీ-ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం
సముద్ర పరిశోధన, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీలు, కమ్యూనికేషన్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై ఈ ఒప్పందం ఫోకస్ చేయగా, సముద్ర పరిశోధనతో పాటు విద్య, శిక్షణ, కన్సల్టెన్సీ సేవలు అందించే ఉద్దేశం కూడా ఉంది.

3. ఐఐటీ-ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందం
స్వయం ప్లస్, ఐఐటీ ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నాణ్యత పెంచే ఈ ఒప్పందం ప్రధానంగా యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సంకల్పించబడింది.

4. ఐఐటీ-ఏపీ విద్యాశాఖ ఒప్పందం
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించే ఈ ఒప్పందం ద్వారా ఐఐటీ మద్రాస్, ఏపీ ప్రభుత్వంతో కలిసి ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక శిక్షణ కార్యక్రమాలు అందించనుంది.

5. ఐఐటీ-ఇన్వెస్టిమెంట్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ ఒప్పందం
కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలను లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయడం, వ్యాపార అవకాశాలు సృష్టించడం వంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే ఒప్పందం.

6. ఐఐటీ-ఐటీ శాఖ ఒప్పందం
విశాఖపట్నం నగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వే‌గా అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలో డేటా కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఐఐటీ మద్రాస్, ఏపీ ఐటీ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది.

7. ఐఐటీ-ఆర్టీజీఎస్ శాఖ ఒప్పందం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి రంగాల్లో సాఫ్ట్‌వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

8. ఐఐటీ-క్రీడల శాఖ ఒప్పందం

అమరావతిలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయడంపై ఐఐటీ మద్రాస్ సాంకేతిక సలహాలను అందించే ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలు అమరావతిని అభివృద్ధి చేయడంలో, సాంకేతికత, పరిశోధన, విద్య, క్రీడల, సముద్ర పరిశోధన వంటి రంగాల్లో కీలక ప్రగతిని చేర్చగలవు.

Seethakka: స్వయం సహాయ‌క సంఘాల‌కు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్..