బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై జనవరి 1 నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్‌ను యాచక రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటికే భిక్షాటనపై నిషేధం విధించింది. 10 నగరాల్లో ఈ ప్రచారం జరుగుతోంది. అధికార యంత్రాంగం కొన్ని షాకింగ్ విషయాలు కూడా వెల్లడించింది. బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించి ఆరు నెలల పాటు పని చేసేందుకు ఓ సంస్థ సహాయం చేస్తుందని తెలిపింది.
ముందుకు వచ్చిన సంస్థ..
ఈ ప్రయత్నంలో ప్రభుత్వానికి సహాయం చేయడానికి ఇండోర్‌కు చెందిన ఒక సంస్థ ముందుకు వచ్చిందని మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా తెలిపారు. ఈ సంస్థ వారికి ఆరు నెలల పాటు ఆశ్రయం కల్పిస్తుందన్నారు. అనంతరం వారికి పని కోసం ప్రయత్నిస్తుంది. ప్రజలను భిక్షాటన నుంచి విముక్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాట్లు తెలిపారు. ఇండోర్‌ను నిజంగా బిచ్చగాళ్ల రహిత నగరంగా మార్చడంలో సహాయపడే ప్రశంసనీయమైన చొరవ అని పేర్కొన్నారు.
ఇండోర్‌లో కఠిన చర్యలు..
అయితే.. భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా చెప్పబడే ఇండోర్ ఇప్పుడు బిచ్చగాళ్ల రహితంగా మారుతోంది. ఇందుకోసం అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. ఇండోర్‌లో భిక్షాటనపై నిషేధం విధిస్తూ పరిపాలన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. భిక్షాటనపై చైతన్య యాత్ర ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపారు. జనవరి 1 నుంచి ఎవరైనా భిక్షాటన చేస్తూ కనిపిస్తే వారిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.
జాబితాలో హైదరాబాద్ కూడా ….
ఈ ప్రాజెక్ట్ 10 నగరాలను కవర్ చేస్తుంది.అందులో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, అహ్మదాబాద్ ఉన్నాయి. త్వరలో మిగతా ప్రాంతాల్లో కూడా ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. యాచకుల వ్యతిరేక ప్రచారం సందర్భంగా.. ఇండోర్ పరిపాలన కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. ప్రాజెక్టు అధికారి దినేష్ మిశ్రా మాట్లాడుతూ.. నివేదికను సిద్ధం చేసినప్పుడు కొంతమంది యాచకులకు శాశ్వత ఇళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే కొంతమంది పిల్లలు బ్యాంకుల్లో పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. “ఒకసారి ఒక బిచ్చగాడి దగ్గర 29,000 రూపాయలు దొరికాయి. మరో బిచ్చగాడు వడ్డీలకు అప్పులిచ్చే వాడు. భిక్షాటన చేసేందుకు రాజస్థాన్ నుంచి పిల్లలతో ఓ ముఠా ఇక్కడికి వచ్చింది. వారు బస చేసిన హోటల్ నుంచి వారిని రక్షించారు.” అని ఆయన పేర్కొన్నారు.