Mumbai Indians Captain Hardik Pandya Eye Huge Record in IPL: ఐపీఎల్ 2024 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మెగా టోర్నీ తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఆడుతుంది. 17వ సీజన్‌లో ముంబైకి హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. తొలిసారి ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్.. అరుదైన రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించగా.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ ఐదు ట్రోఫీలు అందించాడు. కేకేఆర్‌ను గౌతమ్ గంభీర్ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్), అడమ్ గిల్‌క్రిస్ట్ (దక్కన్ ఛార్జర్స్), డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్)లు తమ కెప్టెన్సీలో ట్రోఫీలు గెలుచుకున్నారు. అయితే గత రెండు సీజన్స్ గుజరాత్ తరఫున ఆడిన హార్దిక్.. ఈసారి ముంబైకి సారథ్యం వహిస్తున్నాడు. ఒకవేళ ముంబైకి హార్దిక్ టైటిల్ అందిస్తే.. రెండు వేర్వేరు ప్రాంచైజీలకు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్‌గా నిలుస్తాడు.
ఐపీఎల్ కెరీర్‌ను హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌తో ప్రారంభించాడు. 2015లో ముంబై తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ముంబై తరఫున 7 సీజన్లు ఆడిన హార్దిక్.. 2022 వేలంలో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌లోకి వెళ్లాడు. తన అద్భుత సారథ్యంతో గుజరాత్ జట్టుకు తొలి ప్రయత్నంలోనే టైటిల్ అందించాడు. 2023లో రన్నరప్‌గా నిలిపాడు. ఇక 2024లో ముంబైకి తిరిగి వచ్చాడు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ సీజన్‌లో ముంబైకి కప్ అందించాలని అతడు చూస్తున్నాడు.